నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా బోయపాటి శ్రీను సినిమా నుంచి ఓ టీజర్ బయటకు వచ్చింది. టీజర్ చిన్నదే. కానీ... అందులో బాలయ్య ఉగ్రరూపం చూసి అభిమానులు ఖుషీ అయిపోయారు. వాళ్లకు ఇంతకంటే పుట్టిన రోజు కానుక ఏముంటుంది?
సరిగ్గా ఇలాంటి టీజరే.. ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆశించారు. మే 20న తారక్ పుట్టిన రోజు జరిగింది. ఈ సందర్భంగా `ఆర్.ఆర్.ఆర్` నుంచి ఓ టీజర్ వస్తుందని ఆశించారు. కానీ లాక్ డౌన్ వల్ల టీజర్ కట్ చేయడం, దాన్ని పూర్తి చేయడం కుదర్లేదని రాజమౌళి చెప్పడంతో నిరాశ చెందారు. `ఆర్.ఆర్.ఆర్` ప్రారంభమై చాలా కాలం అయ్యింది. ఎన్టీఆర్‌కి సంబంధించిన ఎన్నో సీన్లు తీసుంటారు. అందులో టీజర్‌కి సరిపడా షాట్లే దొరకలేదా? మరి బోయపాటి సినిమా ఎప్పుడు మొదలైందని, ఓ చిన్న షెడ్యూల్ మాత్రమే పూర్తయ్యింది. కానీ అందులోంచి ఓ డైలాగ్ కట్ చేసి వదిలాడుగా బోయపాటి. టీజర్ కట్ చేయడం, దానికి ఆర్.ఆర్ జోడించడం, డబ్బింగ్ చెప్పడం - ఇవన్నీ లాక్‌డౌన్‌లోనే కదా జరిగాయి. అలాంటప్పుడు బోయపాటికి సాధ్యమైన విషయం రాజమౌళికి ఎందుకు సాధ్యం కాలేదు. ఇలాంటిదే ఓ చిన్న టీజర్ విడుదల చేస్తే ఫ్యాన్స్ హ్యాపీ గా ఫీల్ అయ్యేవారు కదా..? ఏదేమైనా ఇలాంటి విషయాల్లో రాజమౌళి చాలా స్లో. మిగిలినవాళ్లు ఆయన కంటే బెటర్ అనే విషయం తేలిపోయింది.