వకీల్ సాబ్ షూటింగ్ దాదాపుగా 75 శాతం పూర్తయ్యింది. మరో నెల రోజులు షూటింగ్ చేస్తే, ఫస్ట్ కాపీ కూడా చేతికి వచ్చేస్తుంది. అయినా సరే, వకీల్ సాబ్‌లో హీరోయిన్ ఎవరన్నది ఇంకా తేలలేదు. ముందు నుంచీ వినిపిస్తున్న పేరు శ్రుతిహాసన్. కాకపోతే... అధికారికంగా ఏదీ ఖరారు కాలేదు. శ్రుతి కూడా ఈ సినిమాలో ఉందో, లేదో చెప్పడం లేదు.
బుధవారం సోషల్ మీడియాలో తన అభిమానులతో చాట్ చేసింది శ్రుతి. ఈసందర్భంగా వకీల్ సాబ్ ప్రస్తావన వచ్చింది. ఈ సినిమాలో మీరున్నారా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు, అవును - కాదు అని నేరుగా సమాధానం ఇవ్వకుండా, `ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పను` అనేసింది. అంటే.. శ్రుతి పేరు ఇంకా చర్చల్లోనే ఉన్నట్టా? తను ఎంపికైనా ఇంకా ఏదీ చెప్పడం లేదా? అనే ప్రశ్న మొదలైంది. చిత్రబృందమే ఈ విషయమై స్పందించాలి. షూటింగులకు తిరిగి అనుమతి ఇవ్వడంతో.. త్వరలోనే `వకీల్ సాబ్` పట్టాలెక్కబోతోంది. ఇందుకోసం హైదరాబాద్‌లో ఓ కోర్టు సెట్ వేశారు. అందులోనే సింహభాగం షూటింగ్ జరగబోతోంది.