2021లో చిత్రసీమ చూసిన ఘన విజయాల్లో.. అఖండ ఒకటి. ఈ సినిమా దాదాపు 150 కోట్లు సాధించింది. బాలకృష్ణ కెరీర్‌లో ఇది రికార్డ్! ఈ సినిమా బాలీవుడ్ కి వెళ్లబోతోందని, సీక్వెల్ కూడా రాబోతోందని ప్రచారం జరిగింది. అఖండ క్లైమాక్స్ గమనిస్తే.. బోయపాటి శ్రీను సీక్వెల్ కి బీజం వేసుకున్న వైనం అర్థం అవుతుంది. అఘోరా పాత్ర... వెళ్లిపోతూ... `నా అవసరం ఉందనుకున్నప్పుడు తప్పకుండా మళ్లీ వస్తా` అని నిష్క్రమిస్తాడు. సీక్వెల్ కి అదే ఆయువు పట్టు. సో... అఘోరా తిరిగివస్తే.. అఖండ 2 మొదలైపోయినట్టే.
ఈ విషయంలో చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చేశారు. అఖండ 2 వచ్చే అవకాశం ఉందని, బోయపాటి శ్రీను రెడీ అంటే.. తను అఖండ 2 నిర్మించడానికి సిద్ధమని చెప్పుకొచ్చారాయన. ``బోయపాటి శ్రీను మనసులో ఏముందో తెలీదు. ఆయన తీస్తానంటే నేను రెడీ. ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయొచ్చు. అక్షయ్ కుమార్, అజయ్‌దేవగణ్‌లు అయితే ఈ పాత్రకు బాగుంటారు`` అని చెప్పుకొచ్చారాయన. సో.. అఖండ 2తో పాటు.. అఖండ హిందీ రీమేక్ దాదాపుగా ఉన్నట్టే.