వి, టక్ జగదీష్ సినిమాలు ఓటీటీలోకి వచ్చినప్పుడు ఎగ్జిబ్యూటర్లు నానిపై ఫైర్ అయ్యారు. నాని సినిమాల్ని బ్యాన్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అప్పట్లో నాని కూడా వివరణ ఇచ్చుకోవాల్సివచ్చింది. నిజానికి ఓటీటీలో సినిమాల్ని విడుదల చేయడం నానికి సుతారమూ ఇష్టం లేదు. నిర్మాతల ఒత్తిడికి తల వంచి ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది. శ్యామ్ సింగరాయ్‌కి ముందు కూడా అలాంటి పరిస్థితులే వచ్చాయి. నాని కెరీర్‌లోనే భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా అది. ఏపీలో టికెట్ రేట్లు తగ్గడం, పరిస్థితులు ఇంకా అనుకూలించకపోవడంతో, ఈ సినిమా కూడా ఓటీటీలో విడుదల చేస్తారా? అనిపించింది. అయితే... నాని ఇక్కడే ఎగ్జిబ్యూటర్ల వైపు నుంచి థియేటర్ల వైపు నుంచి ఆలోచించాడు. ఈసినిమా కూడా ఓటీటీకి ఇస్తే... మరిన్ని విమర్శలు తప్పవు. అందుకే... నిర్మాతలపై భారం పడకుండా ఓ కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు.
ఈ సినిమా కోసం తీసుకున్న తన పారితోషికంలో 50 శాతం నిర్మాతలకు వెనక్కి ఇచ్చేసినట్టు టాక్. శ్యామ్ సింగరాయ్ కోసం నాని 10 కోట్లు తీసుకున్నట్టు తెలుస్తోంది. అందులో సగం అంటే. 5 కోట్లు నాని వెనక్కి ఇచ్చాడట. అలా.. నిర్మాతలపై భారం తగ్గించాడని టాక్. ఇదంతా... తన సినిమా థియేటర్లలో విడుదల కావాలన్న మంచి ఉద్దేశ్యంతోనే. అయితే ఈ త్యాగాన్ని ఇప్పటికైనా నానిని విమర్శించేవాళ్లు గుర్తు పెట్టుకుంటే మంచిది. ఓ మంచి ప్రాజెక్టు బయటకు రావడానికి మన హీరోలు తమ పారితోషికాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధమే అని నాని మరో సారి నిరూపించుకున్నాడు. హ్యాట్సాఫ్ నాని.