పాన్ ఇండియా సినిమాగా విడుదలైంది పుష్ప. అయితే.. రిలీజ్ రోజుకి ముందు వరకూ టెన్షనే. మిగిలిన భాషల్లో అసలు ప్రచారమే చేయలేదు. అంత సమయం టీమ్ కి దక్కలేదు. మరోవైపు ముంబైలో ఆర్.ఆర్.ఆర్ బృందం భారీ ఎత్తున ప్రచారం చేసుకుంది. పుష్ప పోస్టర్లు విడుదల చేయడం తప్ప, హిందీలో ఎలాంటి ప్రమోషన్లూ చేసుకోలేదు. అయినా సరే... బాలీవుడ్ లో సత్తా చాటింది పుష్ప. ఇప్పటి వరకూ దాదాపు 30 కోట్లు వసూలు చేసిందట. బాహుబలి 1, బాహుబలి 2, కేజీఎఫ్ తరవాత.. ఆ స్థాయిలో ఓ సౌత్ సినిమా బాలీవుడ్ లో ఇన్ని వసూళ్లు తెచ్చుకోవడం ఇదే ప్రధమం.
అల్లు అర్జున్ కి బాలీవుడ్ లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. తన సినిమాల్నీ అక్కడ డబ్బింగ్ రూపంలో వెళ్తుంటాయి. అందుకే పుష్పకి అక్కడ అంత క్రేజ్ వచ్చింది. ఇప్పటి వరకూ ఈ సినిమా 30 కోట్లు చేసినా లాంగ్ రన్ లో దాదాపు 40 కోట్ల వరకూ వసూలు చేసే అవకాశం ఉందని టాక్. అదే జరిగితే బాహుబలి తరవాత ఆ స్థాయిలో వసూళ్లు సాధించిన డబ్బింగ్ సినిమా పుష్పనే అవుతుంది. అదీ కాకుండా ఎలాంటి ప్రమోషన్లూ లేకుండా. అదే ప్రమోషన్లు భారీగా చేసుకుని ఉంటే, పుష్ప రేంజ్ ఏ స్థాయిలో ఉండేదో..?