ఓ హీరోని చూసి సినిమాకెళ్తారు. హీరో ఇమేజే టికెట్లు తెగేలా చేస్తుంటుంది. అయితే ఓ దర్శకుడి పేరు చూసి కూడా టికెట్ తెగ్గొట్టారంటే, కేవలం దర్శకుడిపై నమ్మకంతోనే థియేటర్లోకి అడుగుపెడుతున్నారంటే కచ్చితంగా ఆ దర్శకుడికంటూ ప్రత్యేకమైన బ్రాండ్, ఇమేజ్ దక్కించుకొన్నట్టే. అలా.. తనకంటూ సెపరేట్ మార్క్ సృష్టించుకొన్న దర్శకుడు బోయపాటి శ్రీను. రవితేజ, వెంకటేష్, బాలకృష్ణ, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇలా ఆయన ప్రయాణం స్టార్లతోనే సాగుతోంది. సరైనోడు లాంటి సూపర్ డూపర్ హిట్ తరవాత ఆయన బన్నీ కంటే బడా స్టార్ తో సినిమా చేయొచ్చు. కానీ.. బెల్లంకొండ శ్రీనివాస్‌తో సినిమా పట్టాలెక్కించారు. బెల్లంకొండ వయసు రెండు సినిమాలు మాత్రమే. అయినా సరే.. ఈ సినిమాకి బీ,సీ సెంటర్ల నుంచి భారీ వసూళ్లు వస్తున్నాయంటే - రెండో వారంలో థియేటర్లు తగ్గాల్సింది పోయి పెరుగుతున్నాయంటే, తక్కువ థియేటర్లు అందుబాటులో ఉన్నా - భారీ వసూళ్లు దక్కించుకొందంటే అది కేవలం బోయపాటి శ్రీను స్టామినా. ముందు నుంచి కూడా జయ జానకి నాయక `బోయపాటి సినిమా` అనే బ్రాండ్‌తోనే చలామణీ అవుతోంది. బోయపాటి ని చూసే వసూళ్లు వస్తున్నాయి. ఈ సినిమాతో.. స్టార్లతోనే కాదు, కొత్త హీరోలతోనూ మాస్, కమర్షియల్ సినిమాలు చేయగలను అని నిరూపించుకొన్నాడు బోయపాటి. ఇది వరకటి హిట్లు ఇవ్వని సంతృప్తి బహుశా.. ఈ సినిమాతో దక్కి ఉండొచ్చు. మరి తదుపరి స్టార్ హీరోతో సినిమా చేస్తాడా, లేదంటే కొత్త వాళ్లతో ఈ తరహా ప్రయత్నాలు చూపిస్తాడా అనేది వేచి చూడాలి.