తెలుగు చిత్రసీమ క్రమంగా మారుతోంది. ఇది వరకు రెగ్యులర్ మాస్ మసాలా చిత్రాలకే ఇక్కడ గిరాకీ ఉండేది. మెల్లమెల్లగా.. ఇలాంటి కథలు తగ్గుతున్నాయి. సినిమాలో ఏదో ఓ కొత్త పాయింట్ లేకపోతే జనాలు థియేటర్లకు రారన్న విషయం మెల్లమెల్లగా అర్థమవుతోంది. ఆరు పాటలు, నాలుగు పాటలతో సినిమా చుట్టేస్తే - ప్రేక్షకులు మురిసిపోయే రోజులు పోయాయని తేలిపోయింది. అందుకే దర్శకుల ఆలోచనా ధోరణి మారింది. హీరోలూ మారారు.కొత్త కథలు, కొత్త జోనర్లు పుట్టుకొస్తున్నాయి.
అయితే ఇలాంటి వాతావరణంలోనూ కొంతమంది దర్శకులు అస్సలు మారరు. ఎప్పుడూ ఒకే ఫార్ములా పట్టుకుని ప్రయాణం చేస్తుంటారు. అందులోనే హిట్లు కొడతారు. అందులోనూ ఎదురు దెబ్బలూ తింటారు. ఆ కోవకు చెందిన దర్శకుడే బోయపాటి శ్రీను. భద్ర నుంచి మొన్నటి వినయ విధేయ రామా వరకూ బోయపాటి మాస్ మంత్రాన్నే జపించారు. ఆయన కథల్లో హీరో ధీరోధాత్తుడు. అతనికో సమస్య వచ్చి పడుతుంది. ఓ భయంకరమైన విలన్‌తో ఢీ కొడతాడు. ఈ ప్రయాణంలో తన కుటుంబానికి ఆపద వస్తుంది. విలన్ నుంచి తన కుటుంబాన్ని ఎలా రక్షించాడు అన్నదే కథ. ఇలాంటి కథలు చిత్రసీమ పుట్టినప్పటి నుంచీ చాలా వచ్చాయి. అదే ఫార్ములాలో బోయపాటి హిట్లు అందుకున్నాడు. ఫ్లాపులూ కొట్టాడు. ఇప్పుడు బోయపాటి కొత్తగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఈ ఫార్ములాని వదిలి - తన పంథాని మార్చి కొత్త సినిమా చూపించాల్సిన అవసరం వచ్చింది.
కానీ బోయపాటి ఏమాత్రం మారలేదని తెలుస్తోంది. బాలకృష్ణతో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రంలో బోయపాటి మళ్లీ తన రెగ్యులర్ కమర్షియల్ స్టైల్‌ని చూపించబోతున్నాడట. ధీరోదాత్తుడైన హీరో - క్రూరుడైన విలన్... వీళ్ల మధ్య పోరాటమే ఈ సినిమా అని తెలుస్తోంది. దాదాపు ఏడెనిమిది ఫైట్లు ఈ సినిమాలో ఉండబోతున్నాయట. పొలిటికల్ టచ్ కూడా ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. ఈమధ్య కాలంలో అరిగిపోయిన రైతుల కష్టాలు అనే ఫార్ములానే ఈ సినిమాలో వాడబోతున్నాడట. మొత్తానికి బోయపాటి ఏం మారలేదు. ఈ సినిమాతో తన జాతకమైనా మారుతుందో లేదో చూడాలి.