బ్రహ్మానందం... టాలీవుడ్‌లో అత్యంత ఖరీదైన హాస్యనటుడు. వేయి సినిమాలు చేసి గిన్నిస్ బుక్ ఎక్కిన ఘనుడు. అయితే.. సేవా తత్పరత విషయంలో, డబ్బులు ఖర్చు చేసే విషయంలో బ్రహ్మానందం మహా పిసినారి అని చెప్పుకుంటుంటారు. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు స్టార్లంతా ధారాళంగా విరాళాలు ఇస్తే, బ్రహ్మానందం మాత్రం గీచి గీచి తప్పదన్నట్టు ఇస్తారని విమర్శిస్తుంటారు. అయితే ఈమధ్య సీసీసీ కోసం ఆయన రూ.3 లక్షలు విరాళం ప్రకటించారు. దాంతో బ్రహ్మీ మారాడని చాలామంది కితాబులు ఇచ్చారు.
అయితే... బ్రహ్మానందం మాట వేరు. దానాలు, ధర్మాలు చేశామని గొప్పలు చెప్పుకోవడం కరెక్టు కాదని అలా చెప్పుకోవడం పిచ్చితనమని వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నారు. ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దాన ధర్మాల టాపిక్ వచ్చింది. ``ఈ గ్లోబు అందరిదీ. అందరికీ సమాన హక్కులున్నాయి. దేవుడు ఇచ్చిందే ఇంకొకడికి ఇస్తున్నాం. అందులో గొప్పదనం ఏమీ లేదు. దానం చేస్తే ఆ సంగతి ఎవరికీ తెలీయకూడదు, పబ్లిసిటీలెందుకు? ఇప్పటి వరకూ నేను 23 మంది పేద అమ్మాయిలకు పెళ్లిళ్లు చేశాను. ఇలాంటి విషయాలు నేనెప్పుడూ చెప్పుకోను`` అని చెప్పుకొచ్చారు బ్రహ్మీ. ఈ రోజుల్లో ఒక్క ఆడపిల్లని అత్తారింటికి సాగనంపడమే గగనం. అలాంటిది 23 మంది పిల్లలకు పెళ్లి చేశారంటే బ్రహ్మీ గ్రేటే.