టాలీవుడ్‌లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ దిగ్గజ హాస్య నటుడు... బ్రహ్మానందం వెండి తెరకు గుడ్ బై చెప్పబోతున్నార్ట. ఆయన రిటైర్‌మెంట్ తీసుకుంటారని, అయితే నటనకు దూరం అవ్వడం లేదని, బుల్లి తెరపై కొన్ని షోస్, సీరియళ్లలో కనిపిస్తారని జోరుగా వార్తలొస్తున్నాయి.
ఈమధ్య బ్రహ్మానందానికి పెద్దగా అవకాశాలు రావడం లేదు. పైగా నవతరం హావా ఎక్కువైంది. బ్రహ్మానందానికి ఇటీవల ఓ మేజర్ ఆపరేషన్ జరిగింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని, ఆయన వెండి తెర నుంచి గౌరవంగా తప్పుకుందామని భావిస్తున్నార్ట. అయితే ఆయన సన్నిహితులు మాత్రం బ్రహ్మానందం సినిమాలకు అస్సలు దూరం కారని, ఆయన మంచి పాత్రల కోసం చూస్తున్నారని, టీవీల్లో కనిపించినా- సినిమాలకు దూరం అయ్యే ప్రసక్తే ఉండదని చెబుతున్నారు. బ్రహ్మీ స్థాయికి తగిన పాత్రలు రావడం లేదని, అందుకే ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న రంగమార్తాండలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు బ్రహ్మీ. ఆ సినిమా బ్రహ్మీకి ఓ కొత్త ఇమేజ్ తెచ్చి పెడుతుందని సినీ జనాల నమ్మకం. మరి ఏమవుతుందో చూడాలి.