ఉప్పెనతో తొలి అడుగులోనే సూపర్ హిట్టు కొట్టాడు బుచ్చిబాబు. ఆ సినిమా సంచలన విజయం సాధించడంతో అందరి కళ్లూ బుచ్చిబాబుపై పడ్డాయి. వెంటనే ఎన్టీఆర్ కూడా పిలిచి అవకాశం ఇచ్చేశాడు. `పెద్ది` అనే స్పోర్ట్స్ డ్రామాని ఎన్టీఆర్ కోసం సిద్ధం చేశాడు బుచ్చి బాబు. అయితే.. ఈ ప్రాజెక్టు ఓ అడుగు ముందుకేస్తే, నాలుగు అడుగులు వెనక్కి వేస్తోంది. ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ సినిమాతో బిజీ. ఆ తరవాత ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుంది. ఇవి రెండూ అయ్యాక గానీ, ఎన్టీఆర్ డేట్లు ఇవ్వలేడు. అంత వరకూ బుచ్చి ఖాళీగా కూర్చోలేడు. అందుకే ఇప్పుడు మరో కథ రెడీ చేసుకుంటున్నాడట. అది కూడా..చరణ్ కోసం.
రామ్ చరణ్ కోసం బుచ్చిబాబు ఓ కథ రెడీ చేసుకొన్నాడని టాక్. ఈ కథ పై చరణ్, బుచ్చిల మధ్య చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది. బుచ్చి చెప్పిన పాయింట్ బాగా నచ్చడంతో `దీన్ని డవలప్ చేయ్.. మనం తప్పకుండా చేద్దాం` అనే అభయ హస్తం అందించాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే చరణ్ దొరకాలన్నా టైమ్ పట్టేలా ఉంది. ముందు శంకర్ సినిమా పూర్తవ్వాలి. ఆ తరవాత గౌతమ్ తిన్ననూరి తో ఓ సినిమా చేయాలి.
అయితే.... బుచ్చి చెప్పిన కథ నచ్చితే, శంకర్ సినిమా అవ్వగానే ఈ ప్రాజెక్టునే చరణ్ పట్టాలెక్కిస్తాడని, గౌతమ్ కథని హోల్డ్ చేసే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ కథని పక్కన పెట్టి చరణ్ పై ఫోకస్ పెట్టాడు బుచ్చిబాబు.