వస్తువు పాతబడుతుంటే - దానిపై ఇష్టం, ప్రేమ తగ్గుతుంటాయి. సినిమా ఆలస్యం అవుతున్నా అంతే. క్రేజ్ మాయం అవుతుంది. `ఆర్.ఆర్.ఆర్` విషయంలోనూ ఇదే జరుగుతోందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ యేడాది జూన్ లో విడుదల కావాల్సిన సినిమా ఇది. పరిస్థితుల ప్రభావం, కరోనా వల్ల ఆలస్యం అయ్యింది. 2021 సంక్రాంతి అన్నారు. అప్పటికీ రాదు. 2022 సంక్రాంతికి వచ్చే అవకాశాలున్నాయంతే. ఈ సినిమా ఆలస్యం అయ్యిందనో ఏమో.. జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదని టాక్. అందుకు `ఆర్.ఆర్.ఆర్` లేటెస్ట్ వీడియోకి వచ్చిన వ్యూసే నిదర్శనం.
రాజమౌళి సినిమా, అందులోనూ భారీ మల్టీస్టారర్.. ఈ సినిమాకి సంబంధించిన ఏ చిన్న అప్ డేట్ వచ్చినా - దాని వ్యూస్ మామూలుగా ఉండవు. కానీ.. `ఆర్.ఆర్.ఆర్` షూటింగ్ మళ్లీ మొదలైందని, త్వరలోనే భీమ్ ( ఎన్టీఆర్) టీజర్‌ని విడుదల చేస్తామని చెబుతూ విడుదల చేసిన టీజర్‌కి ఏమంత గొప్ప స్పందన రాలేదు. ఈ వీడియోకి ఇప్పటి వరకూ 2 మిలియన్ల వ్యూస్ కూడా రాలేదు. దాన్ని బట్టి - ఆర్.ఆర్ ఆర్ క్రేజ్ కాస్త తగ్గిందేమో అనిపిస్తోంది. అయితే.. రాజమౌళిని తక్కువ అంచనా వేయకూడదు.
ఏదో ఓ మ్యాజిక్ చేసి, మళ్లీ సినిమా గురించి మాట్లాడుకునేలా చేయగలడు. త్వరలో విడుదల కాబోతున్న ఎన్టీఆర్ టీజర్ తో మళ్లీ సినిమాపై అంచనాలు పెరగడం ఖాయమని ఫిల్మ్ నగర్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఆ టీజర్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు... టాలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.