దాసరి తనయుడు అరుణ్ కుమార్ వివాదంలో చిక్కుకున్నారు. తనపై దౌర్జన్యానికి ప్రయత్నించారని, దుర్భాషలాడాడని, తన ఇంటిలోకి దొంగతనంగా ప్రవేశించాడని, చంపుతా అని బెదిరించాడని స్వయానా అరుణ్ కుమార్ సోదరుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాసరి తనయులు ప్రభు, అరుణ్ ల మధ్య ఎప్పటి నుంచో ఆస్తి తగాదాలున్నాయి. ప్రస్తుతం అవి కోర్టులో నలుగుతున్నాయి. ఈ గొడవలు పరిష్కరించాలని మోహన్‌బాబు, మురళీ మోహన్ తదితరులు ఇది వరకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. దాంతో కోర్టు మెట్లు ఎక్కాల్సివచ్చింది.
ఆ వివాదం ఇంకా నడుస్తూనే ఉండగా, ఈనెల 24 రాత్రి హైదరాబాద్ లోని ప్రభు ఇంటిలోకి దొంగతనంగా ప్రవేశించాడు అరుణ్. ఇంట్లోకి చొరబడి, బీరువా తాళాలు బద్దలు కొట్టాలని చూశాడని, తనని దుర్భాషలాడాడని ప్రభు ఆరోపిస్తున్నాడు. అరుణ్ ఇంటి గేటు దూకిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో కూడా నిక్షిప్తమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు అరుణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలెట్టారు.