ఇటీవల ఓటీటీలో విడుదలైన సినిమా `పెంగ్విన్`. ఈ సినిమా చూసినవాళ్లంతా పెదవి విరిచారు. క్లైమాక్స్ బాగోలేదని, బోరింగ్ గా ఉందని తేల్చి చెప్పారు. అమేజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమాకి వ్యూవర్ షిప్ మాత్రం అనూహ్యంగా వచ్చింది. దానికి కారణం.. అమేజాన్ చేసుకున్న పబ్లిసిటీ. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న సూత్రాన్ని అమేజాన్ పాటించింది. సినిమాని వెండి తెరపై చూపిస్తున్నా, ఓటీటీకి పరిమితం చేసినా, ప్రచారం అత్యంత కీలకం. ఆ ప్రచారం విషయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకోవడంతో పెంగ్విన్ కి మంచి వ్యూవర్ షిప్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో ఇప్పుడు వచ్చిన కొత్త సినిమా `కృష్ణ అండ్ హిజ్ లీల`.
సురేష్ ప్రొడక్షన్స్ బ్యాన్ బోన్‌గా ఉన్న సినిమా ఇది. క్షణం లాంటి సూపర్ హిట్ ఇచ్చిన రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రూపొందింది. థియేటర్ రిలీజ్ కోసం తీసిన సినిమా... నెట్ ఫ్లిక్స్‌లో కనిపించే సరికి.. షాకయ్యారు సినీ అభిమానులు. కనీస ప్రచారం కూడా లేకుండా, గప్ చుప్‌గా సినిమా వచ్చేసింది. అయితే ఇప్పటి వరకూ ఓటీటీ లో విడుదలైన సినిమాలకంటే... క్వాలిటీ పరంగా, మేకింగ్ పరంగా, కంటెంట్ పరంగా `కృష్ణ లీల` బాగుందన్న టాక్ మూటగట్టుకుంది. కానీ ఏం లాభం? పబ్లిసిటీ లేదు. దాంతో వ్యూవర్ షిప్ అంతంత మాత్రమే.
ఇలాంటి సినిమాలకు పబ్లిసిటీ బాగా చేసుకుంటే, ఓటీటీలో మంచి ఆదరణ దక్కేది. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. గట్టిగా పబ్లిసిటీ చేసుకుంటే.. మరింత మందికి చేరువు అవుతుంది.