పవన్ కల్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం వకీల్ సాబ్. ఈ సినిమాకి సంబంధించిన లుక్ ఏదీ అఫీషియల్‌గా బయటకు రాలేదు. చిత్రబృందం విడుదల చేయకముందే - లీకేజీ పుణ్యమా అని ఈ సినిమాలోని లుక్ బయటకు వచ్చేసింది. కోర్టు సీన్‌లో వకీల్ సాబ్ గా పవన్ వాదిస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ ఫొటో చూసి చిత్రబృందం షాక్ తింది. అసలు ఈ లీకేజీలు ఎక్కడి నుంచి జరుగుతున్నాయో తెలీక గందగోళ పడుతోంది. స్టిల్ ఒక్కటే బయటకు వచ్చిందా? లేదంటే కోర్టు సీన్ మొత్తం లీకైపోయిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ కల్యాణ్ సినిమాకి సంబంధించి ఇంత అజాగ్రత్తగా ఎలా ఉంటారంటూ... పవన్ అభిమానులు దిల్ రాజుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి దిల్ రాజు సిద్ధమయ్యారు. వకీల్ సాబ్ లీకేజీపై పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నారని తెలుస్తోంది.
సైబర్ పోలీసులకు ఈ విషయమై దిల్ రాజు ఫిర్యాదు చేస్తారని సమాచారం. నేడో, రేపో దిల్ రాజు పోలీస్ కంప్లైంట్ ఇస్తారని, అందుకు సన్నాహాలు జరచుగుతున్నాయని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అసలు ఈ గొడవలేం లేకుండా.. త్వరలోనే పవన్ లుక్‌ని అఫీషియల్ గా విడుదల చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉంది చిత్రబృందం. ఓ మంచి అప్ డేట్ తో వకీల్ సాబ్ పోస్టర్‌ని విడుదల చేస్తారని సమాచారం. మరి ఆ అప్ డేట్ ఏమిటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఓపిక పట్టాలి.