కెమెరామెన్ ఛోటా కె.నాయుడు తమ్ముడు... శ్యామ్ కె.నాయుడు చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే ఓ నటిని మోసం చేశారన్న కేసులో ఆయన విచారణని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఫోర్జరీ కేసు కూడా మీద పడింది. వివరాల్లోకి వెళ్తే... తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని నటి సాయి సుధ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు కూడా. రిమాండ్ లో ఉన్న శ్యామ్ ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు. సుధతో కోర్టు బయట రాజీకి వచ్చేశామని, తనకి బెయిల్ మంజూర్ చేయమని శ్యామ్ కె.నాయుడు కోర్టుని కోరారు. సుధ సంతకంతో ఉన్న రాజీ పత్రాన్ని ఆయన కోర్టుకు సమర్పించారు. దాంతో నాంపల్లి కోర్టు శ్యామ్‌కి బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ సంతకం తాను చేయలేదని, దాన్ని శ్యామ్ ఫోర్జరీ చేశారని ఇప్పుడు సుధ ఎదురు తిరగడంతో... నాంపల్లి కోర్టు బెయిల్ రద్దు చేసింది. అంతేకాదు.. శ్యామ్‌పై ఫోర్జరీ కేసు కూడా ఫైల్ చేసింది. దాంతో శ్యామ్ చిక్కుల్లో పడినట్టైంది.
బెయిల్ రద్దు అవ్వడంతో శ్యామ్ మరోసారి అరెస్ట్ అయ్యారు. సుధ సంతకం చేసిందా? లేదంటే ఆమె సంతకాన్ని శ్యామ్ ఫోర్జరీ చేశారా? అనే విషయంలో ఇప్పుడు పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.