నందమూరి బాలకృష్ణ - పూరి జగన్నాథ్ కాంబోలో సినిమా అంటేనే ఓ కొత్త రకమైన వైబ్రేషన్స్పుట్టుకొచ్చేస్తున్నాయి. బాలయ్య స్టైల్ వేరు, పూరి స్టైల్ వేరు. ఈ రెండింటికీ పొంతన ఎలా కుదురుతుందా?? అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు.. పూరి తన స్టైల్లో షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నాడు. ఈ సినిమాలో కథానాయికగా తమన్నాని ఎంచుకొన్నారని, మరో ఇద్దరు కథానాయికలకూ చోటుందని, ఆ ప్లేసులోనూ స్టార్ హీరోయిన్లే కనిపిస్తారని ప్రచారం జరిగింది. అయితే అవన్నీ ఒట్టి మాటలే అంటూ పూరి ఇచ్చిన కాస్టింగ్ కాల్ తేల్చేసింది. బాలకృష్ణ సినిమా కోసం కొత్త నటీనటులు కావాలంటూ ఓ ప్రకటన విడుదల చేశాడు పూరి. ముగ్గురు హీరోయిన్లనూ కొత్తవారినే ఎంచుకోబోతున్నాడని ఆ ప్రకటన చూస్తే అర్థమైపోతోంది. విలన్, కమిడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులూ ఇలా 12 మంది ప్రధాన తారాగణం కోసం కొత్తవారిని ఎంచుకోవాలని చూస్తున్నాడు పూరి. బాలయ్య లాంటి ఓ స్టార్ హీరోని పెట్టుకొని, ఇలా కాస్టింగ్ కాల్కి వెళ్లడం, హీరోయిన్లను, విలన్ని కొత్తవారినే తీసుకోవాలని నిర్ణయించుకోవడం సాహసమే. మరి పూరి ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? బడ్జెట్ కంట్రోల్ చేయడానికా, లేదంటే.. బాలయ్యతో నిజంగానే ఓ భారీ ప్రయోగం చేయబోతున్నాడా?? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.