సినీ పరిశ్రమలో సెలబ్రిటీలకు ‘డిప్రెషన్’ అన్నది సర్వసాధారణమైన విషయం. వృత్తిపరమైన సమస్యలు అన్ని రంగాల్లోనూ వుంటాయి. సినీ పరిశ్రమ అందుకు మినహాయింపేమీ కాదు. ‘ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను..’ అనే మాట చాలామంది సెలబ్రిటీల నుంచి విన్పిస్తుంటుంది. ఇందులో సినీ సెలబ్రిటీలు చాలా ఎక్కువ. బాలీవుడ్‌లో తీసుకుంటే, ప్రియాంకా చోప్రా, దీపికా పడుకొనే.. ఇలా చాలామంది ఈ విషయాన్ని ఒప్పుకున్నారు కూడా.
సౌత్‌లోనూ అలాంటివారు ఎక్కువమందే కనిపిస్తారు. డిప్రెషన్ నుంచి తప్పించుకునేందుకు డ్రగ్స్ వాడకం అనేది కొంతవరకు ‘సర్వసాధారణమైన వ్యవహారంగా’ చూస్తుంటారు కొందరు సెలబ్రిటీలు. అదే ఇప్పుడు చాలామంది మెడకు చుట్టుకుంటోంది. కంగనా రనౌత్, చాలామంది సెలబ్రిటీలపై డ్రగ్స్ సహా అనేక వివాదాలకు సంబంధించి ఆరోపణలు చేస్తున్న విషయం విదితమే. ఇప్పుడు ఆమె మీదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ లిస్ట్‌లో దీపికా పడుకొనే, కరిష్మాకపూర్ తదితరుల పేర్లూ ప్రచారంలోకి వచ్చాయి.
‘లిస్ట్ చాంతాడంత వుంది.. యంగ్ హీరోయిన్లు కూడా డ్రగ్స్ బారిన పడటం షాకింగ్ ఎలిమెంట్.. డ్రగ్స్ కేవలం వాడడమే కాదు, డ్రగ్స్‌కి బానిసలైపోయినవారూ వున్నారు..’ అంటూ బాలీవుడ్ మీడియా పుంఖానుపుంఖాలుగా కథనాల్ని తెరపైకి తెస్తోంది. బాలీవుడ్ నుంచి ఇటీవల టాలీవుడ్‌లోకి తొంగిచూస్తోన్న కొందరు హాట్ హీరోయిన్స్ పేర్లు కూడా ఈ లిస్ట్‌లో వినిపిస్తుండడం గమనార్హం. అయితే, సినీ పరిశ్రమ పట్ల జరుగుతున్న దుష్ప్రచారం తప్ప, ఇందులో వాస్తవం లేదని కొందరు కొట్టిపారేస్తున్నారు.