తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడు జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సెలబ్రిటీలు సాధారణ పౌరుల్లా క్యూ లైన్లలో నిలబడి ఓటింగ్‌లో పాల్గొనడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఖాళీ సమయం చూసుకుని, హడావిడిగా వచ్చి వెళ్ళిపోవడం కాకుండా, చాలామంది సెలబ్రిటీలు తామూ సాధారణ పౌరులమేనన్న భావన కల్గిస్తూ క్యూ లైన్లలో కన్పిస్తోంటే, చూసేవారికి ఇంట్రెస్టింగ్‌గా అన్పిస్తోంది. 'మేం ఓటు వేస్తున్నాం, మీరూ ఓటేస్తున్నారు కదా..' అని కొందరు పోలింగ్‌కి వెళ్ళేముందు సోషల్ మీడియాలో ఓటు హక్కు గురించి ప్రచారం చేస్తోంటే, 'మేం ఓటు వేశాం.. మీరు వేశారా.?' అని ఇంకొందరు ఓటు హక్కు విలువను తెలియజేస్తున్నారు.
అక్కినేని నాగార్జున తదితర సీనియర్ నటులే కాక, అల్లు అర్జున్, నితిన్ తదితరుల యంగ్ హీరోలు ఉదయాన్నే ఓటు వేశారు. పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చేసరికి, సినీ ప్రముఖులు కావొచ్చు.. రాజకీయ ప్రముఖులు కావొచ్చు.. ఎవరైనాసరే.. సాధారణ ఓటర్లుగానే పరిగణించబడ్తారు. అయితే, కొన్ని చోట్ల సిబ్బంది అత్యుత్సాహం సెలబ్రిటీలకు, ఇతర ఓటర్లకు ఇబ్బందికరంగా మారుతోంది. సెలబ్రిటీలతో ఫొటోలు దిగేందుకు చూపుతున్న అత్యుత్సాహమే అందుకు కారణం.
ఆ సంగతి పక్కన పెడితే, ఓటు హక్కు పట్ల అవగాహన కల్పించడం, యువతరాన్ని పోలింగ్ బూత్‌లవైపు నడిపించడం.. వంటి మంచి ఆలోచనలతో సెలబ్రిటీలు ఓటు హక్కు పట్ల బాధ్యతగా వ్యవహరిస్తుండడాన్ని ప్రత్యేకంగా అభినందించి తీరాల్సిందే. సెలబ్రిటీలు నింపుతోన్న జోష్‌తో, పోలింగ్ బూత్స్ కళకళ్ళాడుతున్నాయి. యువత ఉత్సాహంగా పోలింగ్ బూత్‌ల వైపు పరుగులు పెడ్తున్నారు.