లాక్ డౌన్ వల్ల సినిమాలు స్థంభించిపోయాయి. షూటింగులు ఆగిపోయాయి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అయితే... మిగిలిన పరిశ్రమలకు వెసులుబాటు ఇస్తున్నట్టు సినిమాలకూ మినహాయింపు ఇవ్వాలని నిర్మాతలు కోరుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్నారేమో.. ఇప్పుడు సెన్సార్ చేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతుల్ని మంజూరు చేసింది ప్రభుత్వం. సెన్సార్ బోర్డు నిబంధనల్ని కాస్త సడలించి, సులభతరం చేసింది. ఇక నుంచి ఆన్ లైన్ ద్వారా సెన్సార్ కి దరఖాస్తు చేసుకోవొచ్చు.
ఈ మెయిల్ ద్వారా సెన్సార్ సర్టిఫికెట్ పొంద వచ్చు. క్యూబ్, హార్డ్ డిస్క్ ద్వారా సినిమాని పంపే వెసులుబాటు ఉంది. సెన్సార్ బోర్డు సినిమా చూస్తున్నప్పుడు నిర్మాత, దర్శకుడు.. అందుబాటులో ఉండాల్సిన పని లేదు. ఈ నిబంధనలు త్వరలోనే అమలు కానున్నాయి. ప్రయోగాత్మకంగా హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తారు. ఆ తరవాత.. మిగిలిన చోట్లా అమలు చేయనున్నారు. లాక్ డౌన్ వల్ల చాలా సినిమాలు సెన్సార్ కాకుండా ఆగిపోయాయి. కనీసం ఓటీటీకి తమ సినిమాల్ని అమ్ముకోవాలన్నా సెన్సార్ జరగాల్సిందే. ఆ సినిమాలన్నింటికీ ఇప్పుడు ఉపశమనం లభించినట్టైంది.