ఈవారం మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముగ్గురు హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ముగ్గురికీ హిట్టు కొట్టక తప్పని పరిస్థితి. అయినా... ముగ్గురూ మరోసారి పల్టీ కొట్టేశారు. ఆ ముగ్గురే... కార్తికేయ, విష్ణు, ఆది.
ఆర్.ఎక్స్ 100తో ఓ సునామీలా దూసుకొచ్చాడు కార్తికేయ. ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. దాంతో కార్తికేయ బిజీ హీరో అయిపోయాడు. వరుసగా ఆఫర్లు వచ్చి పడిపోయాయి. కానీ.. ఆ తరవాత ఒక్క హిట్టు లేదు. మంచి దర్శకులతో పనిచేస్తున్నా, నిర్మాతలు భారీగా ఖర్చు పెడుతున్నా, తానే నిర్మాతగా మారినా ప్రభావం చూపించలేదు. `చావు కబురు చల్లగా` సినిమాపై కార్తికేయ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా కోసం గెటప్ మార్చాడు. లుక్ మార్చాడు. డైలాగ్ డెలివరీ మార్చాడు. అయినా.. ఫ్లాపే వచ్చింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమాపై నెగిటీవ్ టాక్ బీభత్సంగా ఉంది. ఈ సినిమా కార్తికేయకు పెద్ద మైనస్ గా మారే ప్రమాదం ఉంది.
విష్ణు పరిస్థితి ఇంకా దారుణం. చాలా ఏళ్లుగా విష్ణుకి విజయాల్లేవు. ఈమధ్య కొంత గ్యాప్ కూడా తీసుకున్నాడు. ఈసారి భారీ స్కేల్ లో సినిమా చేయాలని, తీర్మాణించుకున్నాడు. తానే ఓ కథ రాసి రంగంలోకి దిగాడు. దాదాపు 50 కోట్లు ఖర్చు పెట్టి, మోసగాళ్లు తీశాడు. పాన్ ఇండియా కలరింగు ఇవ్వడానికి కాజల్ ని, సునీల్ శెట్టిని రంగంలోకి దింపాడు. కానీ.. మోసగాళ్లు ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాతో మొత్తం పోయినట్టే.. అని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి.
ఇక... ఆది సాయికుమార్. `ప్రేమ కావాలి`తో గ్రాండ్ డెబ్యూ ఇచ్చిన ఆదికి.. ఆ తరవాత అన్నీ ఫ్లాపులే. శశితో అయినా హిట్టు దొరుకుతుందని భావించాడు. గెడ్డం పెంచి, అర్జున్ రెడ్డిలాంటి లుక్ లోకి వచ్చి మెప్పించాలని చూశాడు. శుక్రవారం విడుదలైన ఈసినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చేసింది. ఈ మూడు సినిమాలకు కనీసం ఓపెనింగ్స్ కూడా లేకపోవడం దురదృష్టం. ఆయా సినిమాల కోసం ఈ హీరోలు ముగ్గురూ బాగా కష్టపడ్డారు. కానీ ఫలితం లేకుండా పోయింది. బెటర్ లక్ నెక్ట్స్ టైమ్.