దాదాపు 1500 చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు చలపతిరావు. నటనపై ఉన్న ఆసక్తితో ఎన్నో నాటకాలు వేశారు. అయితే సినిమాల్లో చలపతిరావుకి తొలి అవకాశం ఇచ్చింది మాత్రం ఎన్టీఆర్. ఈ విషయాన్ని ఓ సందర్భంలో చలపతిరావు స్వయంగా చెప్పారు.
''నటుడి కావాలనే ఉద్దేశంతో మద్రాసు వెళ్లాను. ఏ స్టూడియోకు వెళ్లినా లోపలికి రానిచ్చేవాళ్లు కాదు. అప్పట్లో ఎన్టీఆర్‌ను చూడటానికి ఒక తీర్ధయాత్రలా జనం వచ్చేవారు. నేనూ వెళ్ళా. వచ్చిన వాళ్లందరినీ పంపించేశారు. నేను అక్కడే ఉండిపోయా. ‘నీ సంగతి ఏంటి’ అని ఎన్టీఆర్ అడిగారు. ‘నేను పీయూసీ వరకూ చదువుకున్నా. సినిమాల్లో వేషం కోసమని చదువు మానేసి వచ్చాను’ అని చెప్పా. '' ఇక్కడ వేషాలు రావడం కష్టం. చదువుకో' అన్నారు.
‘లేదన్నయ్యా.. నేను ఫ్యామిలీతో సహా వచ్చేశాను. మళ్లీ వెళ్లడం కుదరదు’ అని చెబితే.. ‘మొండివాడిలా ఉన్నావే. వారం రోజుల తర్వాత కనపడు’ అన్నారు. అలాగే వారం తర్వాత వెళ్లా. అప్పుడే హేమాంభరధరరావు దర్శకత్వంలో ‘కథానాయకుడు’ తీస్తున్నారు. ఆయన్ను పిలిచి ‘వీడు ఎవడో మొండివాడిలా ఉన్నాడు. వీడికో వేషం ఇవ్వండి’ అన్నారు. అలా నా సినీ ప్రస్థానం మొదలైయింది '' అని అలనాటి సంగతులని గుర్తు చేసుకున్నారు చలపతి రావు