పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఘడియలు రానే వచ్చాయి. `అన్ స్టాపబుల్ 2`లో పవన్ ని చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అనుకొంటున్నారు. పవన్ వస్తాడని కూడా అన్ స్టాపబుల్ టీమ్ ప్రకటించింది. ఇప్పుడు ఆ ముహూర్తం వచ్చేసింది. అన్ స్టాపబుల్ సెట్‌లో పవన్ అడుగుపెట్టాడు. ఈరోజు ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ మొదలైంది. సంక్రాంతి పండగ స్పెషల్ ఎపిసోడ్ గా.. పవన్ ఇంటర్వ్యూ రాబోతోందని సమాచారం. పవన్ ఇంటర్వ్యూతోనే... అన్ స్టాపబుల్ 2 సీజన్‌కు ముగింపు పలకబోతున్నారు. ఈ షోకి పవన్‌తో పాటు త్రివిక్రమ్, క్రిష్‌లు కూడా హాజరయ్యారని తెలుస్తోంది.
మరోవైపు బాలయ్య పవన్‌పై ఎలాంటి ప్రశ్నలు సంధిస్తాడో అనే ఆసక్తి మొదలైంది. మూడు పెళ్లిళ్ల మేటర్ దగ్గర్నుంచి, జనసేన రాజకీయాల వరకూ పవన్‌ని అడగాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. వాటికి సమాధానాలు ఈ షోలో బయటకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. టీడీపీ, జనసేన పొత్తుపై కూడా ఓ ప్రశ్న అడిగే అవకాశం ఉందని టాక్. మొత్తానికి ఈ సీజన్‌లో.. వస్తున్న చివరి ఇంటర్వ్యూ ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.