పెద్ద సినిమాలున్నప్పుడు ఓ మోస్తరు పెద్ద సినిమాలే తమ సినిమాల్ని పోస్ట్‌పోన్ చేసుకుంటాయి. ఇక చిన్న సినిమాల సంగతి చెప్పనే అక్కర్లేదు. అడ్రస్ లేకుండి పక్కకి జరిగిపోతాయి. కానీ, గోపీచంద్ కాన్ఫిడెన్స్ ఏంటో తెలీదు కానీ, ఆయన నటించిన 'చాణక్య' సినిమాని దసరా బరిలో దించేశాడు. దసరా బరిలో అంటే, 'సైరా'తో వార్‌కి దిగాడు. అక్టోబర్ 2న 'సైరా' ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మరో మూడు రోజుల్లో అంటే, అక్టోబర్ 5న 'చాణక్య' వస్తున్నాడు. 'సైరా'పై ఉన్న అంచనాలు తెలిసిందే.
ఈ తరుణంలో 'చాణక్య'తో ఇలాంటి రిస్క్ ఎందుకు చేశాడా గోపీచంద్.. అని అందరూ అవాక్కవుతున్నారు. అయితే, 'చాణక్య' కాన్ఫిడెన్స్ వెనక చిన్న కారణం కూడా ఉంది. దీన్ని అందుకే 'కాన్ఫిడెన్స్' అని గట్టిగా నొక్కి వక్కాణించలేం. ముందుంది దసరా. దసరా బరిలో ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్న సినిమాలున్నాయి. వాటి మధ్య తన సినిమాకి స్లాట్ దొరకదనుకున్నాడు కాబోలు.
కొడితే, గిడితే కుంభస్థలాన్ని కొట్టాల్సిందే అనుకున్నాడో ఏమో లేక, ఎలాగోలా తన సినిమాని విడుదల చేసి తీరాలనుకున్నాడో ఏమో.. ముందుగా అనుకున్న డేట్‌ని పోస్ట్‌పోన్ చేయడానికి అస్సలేమాత్రం వెనుకాడలేదు. ఏమో సినిమాలో కంటెంట్ ఉంటే, చిరంజీవి 150 వ సినిమా 'ఖైదీ'తో పాటు బరిలోకి దిగిన శర్వానంద్ 'శతమానం భవతి' సినిమాతో మంచి విజయం అందుకున్న సందర్భాలు లేకపోలేదు. అలాంటి లక్ కలిసొస్తే గోపీచంద్ కూడా సేఫ్ జోన్‌లోకి వెళ్లొచ్చు. అయితే ఇదంతా జరగాలంటే, ప్రమోషన్స్‌పై మన హ్యాండ్‌సమ్ హీరో కాస్త ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందండోయ్. మన హీరోగారు ఇక్కడే 'చాణక్య' తంత్రం వాడాల్సి ఉంది మరి.