'మహానటి'. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు మార్మోగిపోతోంది. సినీ ప్రముఖులు, అభిమానుల్లోనే కాదు, ఏకంగా 'మహానటి' చర్చలు పోలిటిక్స్‌నీ తాకాయి. మొన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ సినిమా చూసి 'మహానటి' అద్భుతం అమోఘం అని పొగడ్తల వర్షం కురిపించారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 'మహానటి'ని కీర్తించారు. టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో నాయకులు 'మహానటి' గురించి చర్చించుకున్నారంటేనే తెలుస్తోంది టాలీవుడ్‌లో 'మహానటి' క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో. మొన్న 'బాహుబలి' నిన్న 'రంగస్థలం', నేడు 'మహానటి' అనదగ్గ స్థాయిలో ఈ సినిమా కీర్తి ప్రతిష్టలు దక్కించుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 'మహానటి' సినిమా చాలా బాగుందట.
సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. అలాగే 'ఎన్టీఆర్' బయోపిక్ కూడా ఇంత బాగా దృశ్య రూపం దాల్చాలని చంద్రబాబు కోరుకున్నారు. ఓ సినిమా గురించి సినీ ఇండస్ట్రీలోనే కాకుండా, రాజకీయ సమావేశాల్లో కూడా చర్చ జరుగుతుందంటే, ఆ సినిమా గొప్పతనం ఏంటో ప్రత్యేకించి గుర్తించాల్సిందే.
అంతేకాదు తాజాగా ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలైన స్వప్నాదత్, ప్రియాంకా దత్‌లు మెగా స్టార్ చేతుల మీదుగా సన్మాన సత్కారాలు అందుకున్నారు. ఇంతటి గొప్ప సినిమాని అందించినందుకు 'మహానటి' టీమ్ మొత్తాన్ని ప్రశంసించారు చిరంజీవి. అంత మంది సీనియర్, జూనియర్ నటీనటల్ని మేనేజ్ చేస్తూ ఓ యంగ్ డైరెక్టర్ ఇంత ప్రతిష్టాత్మక చిత్రాన్ని విజయవంతంగా తెరకెక్కించాడంటే నిజంగా నాగ్ అశ్విన్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.