పుష్ప 1 అనుహ్యమైన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా నార్త్ లో... మంచి వసూళ్లు సాధించింది. నిజానికి నార్త్ లో పుష్ప ప్రచారం చాలా డల్ గా సాగింది. ఆ మాటకొస్తే... ప్రమోషన్లు శూన్యం. అయినా సరే, కళ్లు చెదిరే వసూళ్లు అందుకొంది. బన్నీ డైలాగులు, మేనరిజాలు నార్త్ ప్రేక్షకులకు బాగా ఎక్కేశాయి. ఇప్పుడు వాళ్లందరి దృష్టీ పుష్ప 2 పై పడింది. ఈపాటికి పుష్ప 2 మొదలైపోవాలి. కానీ.. కథ ఇంకా లాక్ చేయకపోవడం వల్ల పుష్ప 2 ఆలస్యం అవుతూ వస్తోంది.
నిజానికి.. ఫిబ్రవరిలోనే పుష్ప 2 సెట్స్‌పైకి వెళ్లాలి. ఆ తరవాత.. ఏప్రిల్ అన్నారు. ఇప్పుడు జూన్ అంటున్నారు. ఆ ఆలస్యానికి కారణం కథలో భారీ మార్పులు చోటు చేసుకోవడమే అని ఇన్ సైడ్ వర్గాల టాక్. పుష్ప కథ విస్తీర్ణం పెరిగిపోవడంతో అది రెండు భాగాలు అయ్యిందన్న విషయం తెలిసిందే. అంటే.. కథ ముందే సిద్ధంగా ఉందన్నమాట. అయితే.. పుష్పకి వచ్చిన అనూహ్యమైన స్పందన దృష్ట్యా పార్ట్ 2పై అంచనాలు పెరిగిపోయాయి. వాటిని అందుకోవాలంటే స్క్రిప్టులో మ్యాజిక్ జరగాల్సిందే. అందుకే కథలో భారీ మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది. పుష్ప 1లో కనిపించే పాత్రలే 2లోనూ ఉంటాయని, కొత్త పాత్రలకు ఛాన్స్ లేదని ఇది వరకే సుకుమార్ చెప్పాడు. అయితే.. ఇప్పుడు కొత్త పాత్రలను పుష్ప 2లో రాబోతున్నాయని, అవి మరింత పవర్‌ఫుల్ గా ఉంటాయని సమాచారం అందుతోంది. కొత్త పాత్రల్ని సృష్టించడం, అందుకోసం తగిన నటీనటుల్ని ఎంచుకోవడం కోసం అన్వేషణ మొదలెట్టడం వల్లే.. పుష్ప 2 ఆలస్యం అవుతోందట. వేసవి వెళ్లాక గానీ, పుష్ప 2 మొదలవ్వదని, 2023లోనే పుష్ప థియేటర్లలోకి వస్తుందని ఇన్ సైడ్ వర్గాల టాక్.