ఆచార్యలో కాజల్ లేదన్న సంగతి తేలిపోయింది. కాజల్ పాత్ర మరీ చిన్నదైపోయిందని, కథకు అడ్డం వస్తోందని, కమర్షియల్ యాంగిల్ కి తప్ప.. దేనికీ పనికి రావడం లేదని, అందుకే పక్కన పట్టేశామని కొరటాల శివ చెప్పేశారు. అయితే...కాజల్ సీన్లకు కత్తెర వేయడానికి వెనుక మరో కారణం ఉందన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్.
నిజానికి కాజల్ ది నిడివిగల పాత్రే. లాహే లాహేతో పాటుగా మరో పాటలోనూ కాజల్ కి చోటుంది. దాంతో పాటు కొన్ని కీలకమైన సన్నివేశాల్లో కాజల్ కనిపించాల్సివుంది. అయితే.. పెళ్లి తరవాత కాజల్ సినిమాలకు కాల్షీట్లు ఇవ్వడానికి మరీ ఇబ్బంది పెట్టిందని సమాచారం. తల్లి అవుతున్నానని తెలిశాక.. అసలు సినిమాలే మానేసింది. ఆ లిస్టులో `ఆచార్య` కూడా ఉంది. ఆచార్యకు కాజల్ కొన్ని డేట్లు కేటాయించింది. కానీ.. ఆ డేట్లలో షూటింగ్ కి డుమ్మా కొట్టింది. కాజల్ తో ఈ వ్యవహారం నచ్చక.. కొరటాల ఆమె సీన్లు మొత్తానికే లేపేశారని తెలుస్తోంది. ఈ విషయంలో చిరు కూడా కొరటాలనే సపోర్ట్ చేశార్ట. `హీరోయిన్ లేకపోయినా.. మన సినిమాకి నష్టం లేదు. కాబట్టి.... మొత్తం సీన్లే తీసేయండి` అని చిరు ఆర్డర్ వేశార్ట. అప్పటికి కాజల్ పై తీయాల్సిన సీన్లు కొన్ని ఉన్నాయి. వాటిని పూర్తిగా పక్కన పెట్టారు. ఓ దశలో కాజల్ ప్లేసులో మరో కథానాయికని తీసుకొందామన్న ఆలోచన కూడా వచ్చిందని, అయితే... అప్పటికే బడ్జెట్ పెరుగుతుండడం, రీషూట్లు చేసే ఉద్దేశ్యం లేకపోవడంతో.. ఆ ప్రతిపాదన విరమించుకున్నారని తెలుస్తోంది.