చిరంజీవితో సినిమా అంటే... నిర్మాతలంతా క్యూకడతారు. చిరుతో సినిమా చేయాలని ప్రతీ దర్శకుడు ఎలా కలలు కంటాడో, ప్రతీ నిర్మాత కూడా.. అలానే ఆశల పల్లకిలో ఊరేగుతాడు. అయితే ఈమధ్య ఆ అవకాశం ఎవరికీ లేకుండా పోయింది. చిరు సినిమా నిర్మాణ బాధ్యతల్ని చరణే చూసుకుంటున్నాడు. మొన్న.. ఖైదీ నెం 150, నిన్న `సైరా`, ఇప్పుడు `ఆచార్య`.. ఈ మూడు సినిమాలకై చరణ్ నిర్మాత. చిరుతో సినిమాలు చేయాలని అశ్వనీదత్, కె.ఎస్.రామారావు, మైత్రీ మూవీస్ సంస్థలు ఎదురు చూస్తున్నా.... అవకాశం దక్కడం లేదు.
`నాన్నగారు భవిష్యత్తులో తీసే సినిమాలన్నింటికీ నేనే నిర్మాత. ఆయన కోసమే కొణిదెల ప్రొడక్షన్స్ మొదలెట్టా` అని ఇది వరకే చరణ్ చెప్పేశాడు. దాంతో.. చిరుతో సినిమా చేయాలన్న మిగిలిన నిర్మాతల ఆశలపై నీళ్లు చల్లినట్టైంది. అయితే ఇప్పుడు చరణ్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. చిరు రాబోయే సినిమాలకు నిర్మాతగా వ్యవహరించకూడదని డిసైడ్ అయ్యాడట. కొంతకాలం.. కొణిదెల ప్రొడక్షన్స్ పై... సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడట. ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయకుల్లో చిరు ఒకరు.
ఆచార్య సినిమాకి తన పారితోషికం 50 కోట్లని తేలింది. ఎంత సొంత సినిమా అయినా, చిరు పారితోషికం ఇవ్వకుండా ఎలా ఉంటాడు? ఇచ్చినా ఇవ్వకపోయినా, లెక్క లెక్కే. దానికి తోడు సైరాకి భారీ నష్టాలొచ్చాయి. ఆచార్యకి బడ్జెట్ పెరుగుతూ వెళ్తోంది. ఇలాంటి సమయంలో మరిన్ని రిస్కులు చేయడం మంచిది కాదని చరణ్ భావిస్తున్నాడట. అదే సమయంలో.. బయటి నిర్మాతలకూ చిరు ఇది వరకే మాట ఇచ్చాడు. దాని ప్రకారం.. కొన్ని సినిమాలు బయటి నిర్మాణ సంస్థలకు చేయాలి. అందుకే చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. ఇక అశ్వనీదత్, దిల్ రాజు లాంటి వాళ్లు .. తమ తమ ప్రయత్నాలు మొదలు పెట్టొచ్చు.