లైగర్ అట్టర్ ఫ్లాప్ పూరి, ఛార్మిలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ సినిమాని విడుదలకు ముందే పూరి లాభాలకు అమ్ముకొన్నాడని, ఇప్పుడు ఆ లాభాలు వెనక్కి ఇచ్చి, ఈ సినిమా కొని తీవ్రంగా నష్టపోయిన బయ్యర్లని పూరి ఆదుకోబోతున్నాడని వార్తలు చక్కర్లు కొట్టాయి. పూరి తన సొంత ఆస్తిని అమ్మేసి, డబ్బుతో.. నష్టాలు భర్తీ చేస్తున్నాడని చెప్పుకొన్నారు. నిజానికి ఇప్పటికే కొంతమందికి పూరి సెటిల్ చేసేశాడట. నైజాం హక్కుల్ని సొంతం చేసుకొన్న వరంగల్ శ్రీనుకి రూ.6 కోట్లు వెనక్కి ఇచ్చాడని టాక్.
అయితే.. ఇప్పుడు మిగిలిన బయ్యర్లు కూడా పూరిపై ఒత్తిడి తీసుకొస్తున్నారట. `మా వ్యవహారం కూడా తేల్చాలి` అని పట్టుపడుతున్నార్ట. నష్టపరిహారాల సంగతి పూరి ఛార్మిపై వేశాడని, అయితే ఇప్పుడు ఛార్మి చేతులు ఎత్తేసిందని, `అందరికీ నష్టపరిహారం చెల్లించడం మా వల్ల కాదు` అని చెప్పేసిందట.
ఈ సినిమాతో నిర్మాతలుగా తాము కూడా నష్టపోయామని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికీ చిల్లి గవ్వ కూడా ఇవ్వలేమని తేల్చేసిందట. దాంతో ఈ కేసు ఇప్పుడు ఛాంబర్ ముందుకు వెళ్లిందని, పూరి ఎట్టిపరిస్థితుల్లోనూ నష్టపరిహారం చెల్లించాల్సిందే అని బయ్యర్లు పట్టుపడుతున్నారని.. ఛాంబర్ పెద్దలు ఈ విషచయంలో త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.