బెల్లం బాబు అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకొనే హీరో.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తెలుగులో తనకంటూ ఓ మార్కెట్ ఉంది. తన సినిమాలు బాలీవుడ్ లో డబ్బింగ్ రూపంలో ఆడాయి. అక్కడ కూడా తను క్రేజ్ సంపాదించుకొన్నాడు. అందుకే ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలుగులో సూపర్ డూపర్ హిట్టయిన `ఛత్రపతి`ని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలసిందే. ఇందులో బెల్లంబాబునే హీరో. మన టాలీవుడ్ దర్శకుడు వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకీ ఇదే తొలి హిందీ సినిమా. అయితే ఈ సినిమా ఎప్పుడో మొదలైనప్పటికీ, ఇప్పటి వరకూ ఎలాంటి అప్ డేటూ రాలేదు. ఈ సినిమా ఆగిపోయిందని, రీషూట్లు చేస్తున్నారని రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై బెల్లంకొండ సురేష్ క్లారిటీ ఇచ్చారు.
ఈ సినిమా షూటింగ్ అయిపోయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని అప్ డేట్ ఇచ్చారు బెల్లంకొండ. ఇది చాలా పెద్ద సినిమా అనీ, యాక్షన్ సన్నివేశాలకు ప్రాధాన్యం ఇచ్చామని, అందుకే షూటింగ్ ఆలస్యమైందని బెల్లంకొండ పేర్కొన్నారు. అంతేకాదు... బాలీవుడ్ హీరోయిన్ డేట్లు సర్దుబాటు కాలేదని, మూడు నెలల పాటు ఆమె కోసం షూటింగ్ ఆగిపోయిందని, ఇప్పుడు తన కాల్షీట్లు అందుబాటులోకి రావడంతో సినిమాని పూర్తి చేశామని చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ కోసం కనీసం మూడు నెలల సమయం పడుతుందని, రిలీజ్‌కి ఇంకా టైమ్ ఉందని, క్లారిటీ ఇచ్చారు బెల్లంకొండ.