ఓ సినిమాకి పబ్లిసిటీ తీసుకురావడంలో బాలీవుడ్ వాళ్ల తరవాతే ఎవరైనా. రిలీజ్‌కు ముందు కావాలని కాంట్రవర్సీలు సృష్టించుకొంటారు. అది వాళ్లకు ఫ్రీ పబ్లిసిటీ తీసుకొస్తుంది. కరణ్ జోహార్ లాంటి వాళ్లతో ఇంటర్వ్యూలు చేయించుకొంటే.. కావాల్సినంత ఫ్రీ పబ్లిసిటీ అని.. బాలీవుడ్ వాళ్లు గట్టిగా నమ్ముతారు. ఓ సినిమా విడుదల అవుతోందంటే... ఆ హీరోతో హీరోయిన్‌కి ఏదో ఉందని ఓ పుకారు పుట్టిస్తారు. అంతే... ఆ సినిమా గురించి, ఆ జంట గురించి జనం మాట్లాడుకోవడం మొదలెడతారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న తంతు. బాలీవుడ్ మీడియా, జనాలు వీటికి బాగా అలవాటు పడిపోయారు. ఇప్పుడు ప్రభాస్ పై అలాంటి పుకారే.. సృష్టించారు బాలీవుడ్ జనాలు. `ఆది పురుష్` సినిమా కోసం.
ప్రభాస్ `ఆది పురుష్` సినిమా షూటింగ్ పూర్తయ్యింది. అయితే... ఇంత వరకూ ఈ సినిమాకి రావల్సినంత క్రేజ్ రాలేదు. అందుకే ఈ సినిమాలో సీతగా చేసింది కృతి సనన్. ఇప్పుడు ప్రభాస్‌కీ, కృతి సనన్ కీ మధ్య ఏదో ఉందని, వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని ఓ వార్తని వండేశారు. బాలీవుడ్ మీడియా దాన్ని ఇప్పుడు హైలెట్ చేస్తోంది. ఎక్కడ చూసినా, వీరిద్దరి గురించి కబుర్లే. కమర్షియల్, మాస్ మసాలా సినిమాలకు ఇలాంటి పబ్లిసిటీ అంటే ఓకే అనుకోవొచ్చు. రాముడిపై సినిమా తీస్తూ... ఇలా డేటింగులు అంటూ అడ్డదారి తొక్కుతూ ప్రచారం కల్పించడం చీప్ ట్రిక్కే. ఈ సినిమాకి సంబంధించి ఒక్క టీజర్ గానీ, ఒక్క పోస్టర్ గానీ బయటకు రాలేదు. అసలు రాముడిగా ప్రభాస్ ఎలా ఉంటాడో కూడా తెలీదు.
ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ ముందు బయట పెట్టి, ఆ తరవాత జనం మాట్లాడుకొనేలా చేయాలి తప్ప.. ఇలాంటి ట్రిక్కులతో కాదు. ఈ విషయాన్ని ఆదిపురుష్ టీమ్ గమనిస్తే మంచిది.