ఎన్నికలు - పరీక్షలు కలసి... టాలీవుడ్ కొంప ముంచేటట్టు కనిపిస్తున్నాయి. ఈ హడావుడి మధ్య సినిమాల్ని విడుదల చేయడానికే నిర్మాతలు భయపడిపోతున్నారు. దానికి తగ్గట్టు విడుదలైన ఏ సినిమా... తగిన రీతిలో వసూళ్లని రాబట్టలేకపోతోంది. హిట్ అనే మాట వినబడి.. చాలా రోజులైపోతోంది. వారం వారం సినిమాలు రావడం, అవన్నీ ఫ్లాప్ టాక్ మూటగట్టుకోవడం మామూలైపోయింది. ఈ నేపథ్యంలో ఈ వారం కూడా నీరసంగానే సాగింది. మూడు సినిమాలు విడుదలైతే.. ఒక్కటంటే ఒక్క సినిమాకీ ప్రేక్షకుల ఆదరణ దక్కలేదు.
బూతు సినిమా అనే ముద్ర, అడల్ట్ కామెడీ కంటెంట్‌తో ముస్తాబైన సినిమా 'చీకటి గదిలో చితక్కొట్టుడు'. ఈ టైటిల్ చూడగానే.. సినిమాకి వెళ్దామనుకున్నవాళ్లే.. వెనకడుగు వేస్తున్నారు. బూతు చూపించి - యూత్ ని ఆకట్టుకోవాలన్న ప్రయత్నం ఫలించ లేదు. అటు కామెడీ, ఇటు హారర్ రెండూ లేక ఈ సినిమా నీరసాన్ని తీసుకొచ్చింది. కనీసం అడల్ట్ కంటెంట్ అయినా గట్టెక్కిస్తుందనుకుంటే.. అదీ అంతంత మాత్రంగానే సాగింది. ఓ తమిళ చిత్రానికి రీమేక్ ఇది. అచ్చంగా డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుందే తప్ప.. తెలుగు సినిమా అనే భావన కలగలేదన్నది సినీ విశ్లేషకుల మాట.
ఈవారం విడుదలైన మరో చిన్న సినిమా.. వినరా సోదర వీర కుమార. అసలు ఈ సినిమాకి అటు ప్రచారం గానీ, ఇటు స్టార్ వాల్యూ గానీ ఏమీ లేవు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అంతా కొత్తవాళ్లే. కథలో బలం ఉన్నా - దాన్ని తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు విఫలమయ్యాడని విశ్లేషకులు చెప్పేశారు. పైగా... థియేటర్లో జనం కూడా లేరు. ఈవారం విడుదలైన డబ్బింగ్ సినిమా 'పులి జూదం' పరిస్థితి కూడా అంతే. మోహన్‌లాల్, విశాల్, శ్రీకాంత్, రాశీఖన్నా లాంటి స్టార్లున్నా - ఈ సినిమాకి కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. మలయళంలో అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా ఇది. తెలుగులో్నూ అదే పరిస్థితి.
అలా మొత్తానికి మరో శుక్రవారం దిగాలుగా గడిచింది. వసూళ్ల గలగల లేక బాక్సాఫీసు వెలవెలబోయింది. మరి... తెలుగు చిత్రసీమకు ఈ దుస్థితి ఇంకెంత కాలమో..??