'అగ్గిపెట్టెలో పట్టేంత చీర'ట అంటూ మన పెద్దోళ్లు చెబుతుంటే విన్నాం. అవును అండి నిజమే. అది నిజం చేసిన గొప్ప వ్యక్తి చింతకింద మల్లేశం. తెలంగాణలోని పోచంపల్లికి చెందిన చింతకింద మల్లేశం అనే చేనేత కార్మికుడు ఇది సాధ్యం చేసి చూపించాడు. ఆసు యంత్రాన్ని కనిపెట్టి, చేనేత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఆయనను పద్మశ్రీ ఏరి కోరి వరించింది. ఇప్పుడిదంతా ఎందుకంటే, ఈ చింతకింద మల్లేశం జీవిత గాధ ఆధారంగా సినిమా రూపొందుతోంది.
'మల్లేశం - ఎక్స్‌ట్రార్డినరీ స్టోరీ ఆఫ్ ఏన్ ఆర్డినరీ మ్యాన్' అనే టైటిల్‌తో ఈ సినిమాను రాజ్ ఆర్ తెరకెక్కిస్తున్నారు. 'పెళ్లి చూపులు' సినిమాతో కమెడియన్‌గా పరిచయమైన ప్రియదర్శి ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. కాగా లేటెస్టుగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేశారు. అనన్య, ఝాన్సీ, చక్రపాణి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో చేనేత కార్మికుల కష్ట నష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు.
మల్లేశం పాత్రలో ప్రియదర్శి చక్కగా ఒదిగిపోయాడు. ఇంతవరకూ తెలంగాణా యాసలో మాట్లాడే కమెడియన్‌గా మాత్రమే ప్రియదర్శి సుపరిచితుడు. కానీ తెలంగాణా చేనేత కార్మికుడు మల్లేశం పాత్రకు తగ్గట్లు ప్రియదర్శి మేకోవర్ మెచ్చుకోదగ్గది. తాజాగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న 'మల్లేశం' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కమెడియన్‌గా తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి 'మల్లేశం'గా ఎలా మెప్పిస్తాడో చూడాలిక.