కరోనా వల్ల వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమైపోయాయి. లాక్ డౌన్ తో జన జీవితాలు స్థంభించిపోయాయి.చిత్రసీమ భారీగా నష్టపోతోంది. ఈ పరిశ్రమపైనే ఆధారపడిన వేలాది కుటుంబాలు ఇప్పుడు అర్థాకలితో అలమటిస్తున్నాయి. వాళ్ల కడుపు నింపడానికి `సిసిసి` మొదలైంది. దీనికి స్టార్సంతా భారీగా విరాళాలుఇచ్చినా... ఈ ఆలోచనకు కర్త కర్మ క్రియ అన్నీ.. చిరంజీవినే. చిత్రసీమలోని కార్మికులందరినీ నెల రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులన్నీ అందించింది సీసీసీ. ఇక మీదట కూడా సీసీసీ ఇలానే పనిచేస్తుందని, కార్మికుల్ని ఆదుకుంటుందని హామీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. తన జీవితంలో ఎవరినీ ఏమీ అడగలేదని, సీసీసీ నిధుల కోసం తాను తాను జోలె పట్టడానికి సైతం సిద్ధమని ప్రకటించారు చిరు.
''చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఎన్నో ఏళ్లుగా నిరాటంకంగా కొనసాగుతోంది. నిధుల కోసం ఎప్పుడూ ఎవరినీ ఏమీ అడగలేదు. సీసీసీకి మాత్రం డొనేషన్లు సేకరిస్తున్నాం. ఈ విషయంలో కార్పొరేట్ కంపెనీల్ని సంప్రదించి డొనేషన్లు సేకరించడానికి కూడా నాకు అభ్యంతరం లేదు. నా సినిమా కుటుంబం చల్లగా ఉండాలంతే. ఈ విషయంలో తమ్మారెడ్డి భరద్వాజా, శంకర్, మెహర్ రమేష్ చాలా సహకరిస్తున్నారు. డొనేషన్లు కూడా వస్తూనే ఉన్నాయి. వాటిని సక్రమమైన రీతిలో ఖర్చు పెడతాం'' అన్నారు చిరంజీవి.