ఇది వరకు ఇద్దరు హీరోలు కలిసి ఓ సినిమా చేయాలంటే గగనం. ఇద్దరి హీరోల ఇమేజ్ ని మ్యాచ్ చేయడం కష్టమని, ఫ్యాన్స్ ని సంతృప్తి పరచలేమని, అలాంటి కథలు దొరకవని - చాలా చాలా కారణాలు చెప్పేవారు. అయితే ఇప్పుడు అవేం వినిపించడం లేదు. మంచి కథ దొరికితే చాలు.. సినిమా చేసేయడానికి స్టార్ హీరోలు రెడీగానే ఉన్నారు. అందుకే మనకు మల్టీస్టారర్లు వరుసకడుతున్నాయి. తాజాగా... మరో భారీ మల్టీస్టారర్ కి సంబంధించిన వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. అదే.. చిరంజీవి, అల్లు అర్జున్ ల సినిమా.
చిరంజీవి, అల్లు అర్జున్ లు కలిసి ఓ సినిమా చేయబోతున్నారని, దీనికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడన్నది ఇండ్రస్ట్రీలో వినిపిస్తున్న నయా ఖబర్. ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్‌కి పండగే. నిజానికి టాలీవుడ్ లో మల్టీస్టారర్ సంప్రదాయానికి కొత్త ఊపిరిలూదింది శ్రీకాంత్ అడ్డాలనే. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`తో టాలీవుడ్ లో మల్టీస్టారర్లు సాధ్యమే అని నిరూపించాడు. తన దగ్గర `అన్నాయ్` అనే ఓ కథ ఉంది. అందులో ఇద్దరు హీరోలు కావాలి. గీతా ఆర్ట్స్ లో ఇప్పటికే ఈ కథ చెప్పేశాడు శ్రీకాంత్ అడ్డాల. అది బన్నీకి నచ్చిందని, మరో హీరోని ఒప్పిస్తే పనైపోతుందని అనుకుంటున్నారు. ఆ మరో హీరో చిరంజీవి అయితే బాగుంటుందని శ్రీకాంత్ అడ్డాల ఆలోచన. గీతా ఆర్ట్స్, పైగా బన్నీ అనగానే చిరు కూడా `నో` చెప్పడు. కాకపోతే.. ఇదంతా జరిగే వ్యవహారమేనా అనిపిస్తోంది.
బ్రహ్మోత్సవం తరవాత శ్రీకాంత్ అడ్డాల మైలేజీ బాగా పడిపోయింది. `నారప్ప` కూడా ఓ మాదిరిగానే అనిపించింది. అలాంటప్పుడు ఇద్దరు హీరోలు శ్రీకాంత్ అడ్డాలకు డేట్లు ఇస్తారా? అన్నది అనుమానమే. కాకపోతే.. ఇప్పటి హీరోలు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో చెప్పలేం. కథ నచ్చితే ప్రొసీడ్ అయిపోతున్నారు. చిరు - బన్నీలు కూడా అదే చేయగలిగితే.. `అన్నాయ్` పట్టాలెక్కేస్తుంది.