ప్రతి ఒక్కరికీ అభిమాన నటీనటులు ఉంటారు. వాళ్లని ఒక్కసారైనా కలవాలని, ఒక్క ఫొటో అయినా తీయించుకోవాలని అనిపిస్తుంది. చిరంజీవికీ అలాంటి కల ఒకటుంది. కానీ అది ఎప్పటికీ తీరదు. ఎందుకంటే... చిరంజీవి అభిమాన నటుడు ఎస్.వి.రంగారావు. ఆయన్ని చిరు తన జీవితకాలంలో ఒక్కసారి కూడా కలవలేదు. అందుకే.. 'ఆ లోటు ఎప్పటికీ అలా ఉండిపోతుంది' అని చెప్పుకొచ్చారు చిరంజీవి. ఎస్వీ రంగారావు జీవిత చరిత్ర `మహా నటుడు` పేరుతో ఓ పుస్తకంగా విడుదలైంది. ఈ పుస్తకాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరు తన అనుభవాల్ని పంచుకున్నారు. ‘‘నా ఆరాధ్య నటుడు, అపారంగా అభిమానించే వ్యక్తి ఎస్వీ రంగారావుగారు. ఎస్వీఆర్, సావిత్రిగారు, కన్నాంబగారి నటనకు భూత, భవిష్యత్ వర్తమానాలు ఉండవు.
వారిది సహజ నటన. ఎస్వీ రంగారావుగారి సినిమాలు చూసి ఎంతో నేర్చుకోవచ్చు. ఆయన ఒక ఎన్‌సైక్లోపిడియా. ఆయనపై అంత అభిమానం పెరగడానికి కారణం మా నాన్నగారు. నా చిన్నప్పుడు నాన్న నాటకాలు వేస్తుండేవారు. ఆర్థిక సమస్యల కారణంగా ఆయనెప్పుడూ మద్రాసు వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నించలేదు. అయితే, ఎస్వీఆర్‌తో కలిసి ‘జగజంత్రీలు’, ‘జగత్ కిలాడీలు’ చిత్రాల్లో చిన్న పాత్రలు వేసే అవకాశం వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఎస్వీఆర్, ఆయన నటన గురించి నాన్న చెబుతుండేవారు. ఆ విధంగా రంగారావుగారి మీద అభిమానం పెరిగింది. నేను నటుడిని అవ్వాలని కోరిక కలగడం బహుశా అప్పుడే బీజం పడి ఉంటుంది. రామ్‌చరణ్ సినిమాల్లోకి వస్తానన్నప్పుడు రంగారావుగారి సినిమాలు చూపించేవాడిని.
ఎస్వీ రంగారావుగారు తెలుగు నేలపై పుట్టడం ఆయన దురదృష్టం. అదే హాలీవుడ్‌లో పుట్టి ఉంటే ప్రపంచం గర్వించదగ్గ నటుడు అయ్యేవారు’ అని గుమ్మడిగారు చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తే. అయితే, రంగారావుగారు తెలుగు నటుడిగా పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. ఇన్నేళ్లలో నేను కోల్పోయింది ఏదైనా ఉందంటే, నేను అభిమానించే నటుడిని ఒక్కసారి చూడలేకపోయాను. కలవలేకపోయాను. నాకు అది తీరనిలోటు. నా జీవితంలో ఎప్పటికీ అది ఒక లోటు'' అని చెప్పుకొచ్చాడు చిరు.