'మా' ఎన్నికల సందర్భంగా టాలీవుడ్ లో వర్గాల పోరు కళ్లకు కట్టినట్టు కనిపించింది. అటు మంచు ఫ్యామిలీ - ఇటు మెగా ఫ్యామిలీ మధ్య జరిగిన పోరుగా `మా` ఎన్నికల్ని అభివర్ణించారు విశ్లేషకులు. ఇది వరకు రెండు కుటుంబాల మధ్య మంచి అనుబంధమే ఉన్నా, తాజా పరిణామాలతో దూరం పెరిగింది. ఈ దూరాన్ని కవర్ చేసే బాధ్యత చిరంజీవి తన భుజాన వేసుకున్నారు.
'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికైన నేపథ్యంలో అటు మోహన్ బాబుకీ, ఇటు విష్ణుకీ చిరు ఫోన్ చేశార్ట. విష్ణుకి తన మద్దతు ఉంటుందని మాట ఇచ్చార్ట. అంతే కాదు... `ఈ ఎన్నికలలో తాను ఎవరికీ మద్దతు తెలపలేదని.. మీడియా అలా సృష్టించిందని, ఎవరు గెలిచినా `మా` అభివృద్ధి కోసం పాటు పడితే చాల`ని చిరుచెప్పారని తెలుస్తోంది. మోహన్ బాబు కూడా `కలిసి పనిచేద్దాం` అంటూ చిరుతో చెప్పినట్టు ఇన్‌సైడ్ వర్గాల టాక్.
కాకపోతే... మోహన్‌బాబు, విష్ణుల తీరుపై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. `మా` అధ్యక్షుడిగా ఎన్నికై, ప్రమాణ స్వీకారం చేసుకున్న సందర్భంలో విష్ణు చిరుని పిలవలేదు. బాలయ్య, కోట శ్రీనివాసరావు, కైకాల లాంటి వాళ్ల ఇళ్లకు వెళ్లి, ఆహ్వానించిన విష్ణు.. చిరుని మర్చిపోవడం విడ్డూరమని, ఇది పెద్దల్ని అవమాన పరచడమే అని ఫైర్ అవుతున్నారు. ఈ విషయంలో మాత్రం విష్ణు తప్పు చేసినట్టే. మరి విష్ణు దాన్ని ఎలా కవర్ చేసుకుంటాడో?