మలయాళంలో సూపర్ హిట్టయిన `లూసీఫర్` రీమేక్‌లో చిరంజీవి నటిస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకుడు. ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఈ సినిమా కోసం చాలా టైటిళ్లు బయటకు వచ్చాయి. `కింగ్ మేకర్`, `రారాజు`, `గాడ్ ఫాదర్`... ఇలా చాలా పేర్లు ప్రచారంలో వినిపించాయి. చివరికి `గాడ్ ఫాదర్` కే చిరంజీవి ఓటేసినట్టు టాక్. అధికారిక ప్రకటన ఏదీ రాలేదు గానీ, ఈ సినిమాకి ఈ టైటిల్ దాదాపుగా ఫిక్సయిపోయినట్టే.
అయితే.. ఈ టైటిల్ అనుకున్నంత ఈజీగా ఏం దక్కలేదు. ఇది వరకే ఈ టైటిల్ ని సంపత్ నంది రిజిస్టర్ చేయించుకున్నాడట. సంపత్ నందిని ఎంతమంది అడిగానా ఈ టైటిల్ ఇవ్వలేదని తెలుస్తోంది. చివరికి చిరంజీవినే రంగంలోకి దిగి... సంపత్ నందికి ఫోన్ చేసి టైటిల్ అడిగాడట. చిరు అడిగిన వెంటనే.. సంపత్ నంది తన దగ్గరున్న ఈ టైటిల్ ని చిరుకి ఇచ్చేశాడని తెలుస్తోంది. అలా.. గాడ్ ఫాదర్ టైటిల్ ని దక్కించుకున్నారు. అయితే ఇదేం కొత్త టైటిల్ కాదు. గతంలో ఏఎన్నార్ సినిమాకి గాడ్ ఫాదర్ టైటిల్ పెట్టారు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. హాలీవుడ్ లో గాడ్ ఫాదర్ అన్నది.. ఓ మైల్ స్టోన్. ఆ స్టోరీని అటూ ఇటూ వాడుకుని వర్మ చాలా సినిమాలు తీశాడు. మణిరత్నం `నాయకుడు`కి కూడా గాడ్ ఫాదరే స్ఫూర్తి.