మెగా ఫ్యామిలీపై ఈమధ్య రోజా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబం ఎప్పుడూ ఎవరికీ సహాయం చేయదని, అందుకే సొంత నియోజక వర్గాల్లోనూ ఓడిపోయారని ఎద్దేవా చేసింది రోజా. ఈ కామెంట్లపై ఇది వరకే నాగబాబు స్పందించారు. రోజాని మున్సిపాటిలీ చెత్త కుప్పతో పోల్చారు. ఇప్పుడు చిరంజీవి కూడా రోజా వ్యాఖ్యలపై పరోక్షంగా సమాధానం ఇచ్చారు. తాను ఎవరికి ఏం చేశానో, ఎంత చేశానో, తనకి మాత్రమే తెలుసని, మరెవ్వరికీ తెలియాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
తాను మనశ్శాంతిని, ఆత్మశ్శాంతిని కోరే వ్యక్తినని, తన నుంచి ఎవరూ ఆ శాంతిని తీసుకెళ్లలేరని.. చెప్పుకొచ్చారు చిరంజీవి. తనతో కలిసి ఉన్నవాళ్లే, తన గురించి తెలిసిన వాళ్లే, తనతో బాగా ఉన్నవాళ్లే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తనని ఆశ్చర్యానికి గురి చేస్తోందని, దీనిపై ఎలా వ్యాఖ్యానించాలో తెలియడం లేదన్నారు చిరు. రోజా పేరు ప్రతక్ష్యంగా ప్రస్తావించకపోయినా సరే, ఇది రోజాపై కౌంటరే అని చిరు అభిమానులు నమ్ముతున్నారు.
చిరు కూడా సీసీసీ పేరుతో సినీ కార్మికుల్ని ఆదుకొన్న సంగతి ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా, ముందుండే వ్యక్తి చిరు అని.. ఆయన గురించి తెలిసి కూడా రోజా ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని, రోజాని ఎవరూ నమ్మే పరిస్థితి లేదని, సొంత నియోజక వర్గంలో రోజాకి ఈసారి ఓటమి తప్పదని రోజాపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.