మెగా కాంపౌండ్ నుంచి బోల్డంతమంది హీరోలున్నారు. వీరిలో ఇటీవల హీరోగా తెరంగేట్రం చేసిన కళ్యాణ్ దేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే, సాక్షాత్తూ ఆయన మెగాస్టార్ చిరంజీవికి అల్లుడు. చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ భర్త అయిన కళ్యాణ్ దేవ్, ఇటీవల 'విజేత' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెల్సిందే.
తొలి సినిమాతోనే ఫర్వాలేదన్పించుకున్న కళ్యాణ్‌దేవ్, మెగా అభిమానులకి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్‌డేట్ ఇచ్చాడు. అది తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించినది కావడం గమనించాల్సిన విషయం. తమ ఇంట మరో చిన్నారి రాబోతున్నట్లు కళ్యాణ్‌దేవ్ ప్రకటించాడు. శ్రీజకు ఇప్పటికే ఓ కుమార్తె వుండగా, ఇప్పుడామె మళ్ళీ గర్భం దాల్చినట్లు కళ్యాణ్‌దేవ్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.
కొత్త అతిథికి వెల్‌కమ్ చెప్పేందుకు 'శ్రీజ కళ్యాణ్' ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు కళ్యాణ్‌దేవ్. మెగా అభిమానులు శ్రీజ, కళ్యాణ్‌లకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. శ్రీజ, ఆ పక్కనే నాటీ బాయ్ అన్నట్లుగా కళ్యాణ్‌దేవ్.. ఈ ఫొటో అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటోంది.
ఇదిలా వుంటే, కళ్యాణ్‌దేవ్ త్వరలోనే ఓ ప్రముఖ దర్శకుడితో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.