చిరంజీవి - మహేష్ బాబు... ఒకరు మెగాస్టార్, ఇంకొకరు సూపర్ స్టార్. ఇద్దరికీ ప్రత్యేకమైన అభిమానగణం ఉంది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే సత్తా ఉన్నవాళ్లే. తమదైన రోజున ఇండ్రస్ట్రీ రికార్డుని బద్దల కొట్టగల వీరులు. అలాంటి ఈ హీరోలిద్దరూ కలిసి నటిస్తే, ఒకేసారి తెరపై సందడి చేస్తే - ఆ హంగామా మామూలుగా ఉండదు. చిరంజీవి 152వ చిత్రంలో మహేష్ నటించబోతున్నాడన్న వార్త వినగానే చిత్రసీమ ఆశ్చర్యపోయింది. నిజంగా ఈ కాంబో కుదిరితే... రికార్డులు బద్దలైపోతాయని నమ్మింది. దానికి తోడు.. అటు మహేష్ గానీ, ఇటు చిరంజీవి గానీ, దర్శక నిర్మాతలు గానీ ఈ వార్తల్ని కొట్టిపారేయలేదు. అలాగని సమర్థించనూ లేదు. కాకపోతే.. ఇప్పుడు మరో వార్త లీక్ అయ్యింది. ఈ సినిమాలో చరణ్ స్థానంలో మహేష్ నటించాలన్న ప్రతిపాదన వచ్చిన మాట నిజమే అని, అయితే ఇప్పుడు మళ్లీ చరణ్ తన పాత్రలో తానే కనిపించాలని డిసైడ్ అయ్యాడని, అందువల్ల మహేష్ అవసరం రాలేదని తెలుస్తోంది.
అయితే.. మహేషష్‌ని పక్కన పెట్టేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పటికే మహేషష్‌తో దర్శక నిర్మాతలు సంప్రదింపులు జరిపారు. పారితోషికం ఎంతివ్వాలి? ఎన్ని కాల్షీట్లు కేటాయించాలి? అనే విషయంపై ఇప్పటికే ఓ అవగాహన కుదిరింది. ఇప్పుడు సడన్‌గా మహేష్‌ని కాదని, మళ్లీ చరణ్‌నే తీసుకోవడం అంత సరైన ఆలోచన కాదు. ఎందుకంటే చిత్రసీమలో ఎమోషన్స్ చాలా సున్నితమైనవి. చరణ్ అందుబాటులో లేడని, మహేష్ దగ్గరకు వెళ్లడం, తీరా మహేష్ ఓకే చెప్పే సమయానికి ప్లాన్ మారి, మళ్లీ చరణ్‌ని తీసుకోవడం కరెక్ట్ అనిపించదు. అందుకే చిత్రబృందం ఇప్పుడు డైలామాలో పడింది. ఒకవేళ మహేష్ కి ఈ సినిమాలో నటించడం కుదరక, తనకు తానే తప్పుకుంటే తప్ప, మహేష్ స్థానంలో చరణ్‌ని మళ్లీ రీప్లేస్ చేయకూడదని, ఈ విషయాన్ని వీలైనంత సున్నితంగా డీల్ చేయాలని, మహేష్ తనకు తాను తప్పుకుంటే తప్ప చరణ్‌ని తీసుకురాకూడదని దర్శక నిర్మాతలు భావిస్తున్నారని టాక్. అంటే... ఈ సినిమాలో నటించాలా, వద్దా అనేది మహేష్ నిర్ణయానికే వదిలేశారన్నమాట.