చిరంజీవి, వై.ఎస్.జగన్‌ల మధ్య జరిగిన భేటీ అటు సినిమా పరిశ్రమలో, ఇటు రాజకీయ రంగంలోనూ హాట్ టాపిక్‌గా మారింది. వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రి అయిన తరవాత ఓ అగ్ర కథానాయకుడు ఆయన్ని కలుసుకుని, ఇలా మీటింగ్ పెట్టడం ఇదే తొలిసారి. ఓ పక్క పవన్ కల్యాణ్ `జనసేన` పార్టీ స్థాపించి, జగన్‌పై పోరు చేస్తుంటే, మరోవైపు అన్నయ్య చిరు రాజకీయంగా ఆయనకు దగ్గర కావాలని చూస్తున్నారని అప్పుడే విమర్శకులు బాణాలు సంధించడం మొదలెట్టేశారు.
చిరు - జగన్‌ల మధ్య ఏఏ అంశాలు ప్రస్తావనకు వచ్చుంటాయి? ఇద్దరూ కలసి ఏం మాట్లాడుకున్నారు? అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది. సైరా విడుదల సమయంలో స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ఆ సమయంలోనే జగన్‌ని కలిసి కృతజ్ఞతలు చెప్పాలనుకుంది సైరా టీమ్. కానీ అప్పట్లో కుదర్లేదు. అందుకే ఇప్పుడు వై.ఎస్.జగన్‌ని చిరు కలిశారని చిరు సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు సైరా సినిమాకి గానూ వినోదపు పన్ను మినహాయించాలని కోరినట్టు కూడా తెలుస్తోంది.
అంతేకాదు.. `సైరా` సినిమాని చూడమని జగన్‌ని చిరు కోరినట్టు సమాచారం. ఇద్దరి మధ్యా రాజకీయపరమైన అంశాలేవీ ప్రస్తావనకు రాలేదని, ఇది కేవలం `సైరా` సినిమాకి సంబంధించిన మీటింగ్ మాత్రమే అని.. తెలుస్తోంది. రాజకీయాలకు సంబంధించిన అంశాలు మాట్లాడుకున్నా.. అవి ప్రస్తుతానికి బయటకు వచ్చే అవకాశమే లేదు.