2022లో అతి పెద్ద డిజాస్టర్ల జాబితాలోకి ఆచార్య చేరిపోయింది. ఈ సినిమా కొన్నవాళ్లంతా సగానికి సగంపైనే నష్టపోయారు. ఇప్పుడు వాళ్లంతా కొరటాల శివ, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, చిరంజీవిలపై ఆశగా చూస్తున్నారు. ఆచార్య టీమ్ నుంచి ఎంతో కొంత వెనక్కి ఇవ్వాల్సిందే. లేకపోతే.. వాళ్లకు కోలుకోలేని దెబ్బ. అందుకే చిరు ఇప్పుడు వారిపై దృష్టి సారించినట్టు సమాచారం.
`ఏయే ఏరియాల్లో ఎంతెంత నష్టపోయారు.. ఎంత కవర్ చేయగలం` అంటూ చిరు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అంకెల వివరాలన్నీ.. చిరు చేతికి చేరిపోయినట్టు టాక్. నష్టపోయిందంతా తిరిగి ఇవ్వకపోవొచ్చు. కానీ 25 నుంచి 30 శాతం వరకూ సర్దుబాటు చేయగలరు. ఇప్పుడు చిత్రబృందం దీనిపైనే దృష్టి పెట్టింది. ఈ సినిమాకి సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో.. కొరటాల చురుగ్గా వ్యవహరించారు. అందుకే ఆయనపైనా ఒత్తిడి పడింది. కొరటాలకు మార్కెట్ లో క్లీన్ ఇమేజ్ ఉంది. దాన్ని ఆయన కాపాడుకోవాలని చూస్తున్నారు. సినిమా రిజల్ట్ తెలిసిన వెంటనే.. బయ్యర్లకు ఆయన టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. `కంగారు పడొద్దు.. చిరంజీవిగారితో మాట్లాడి అన్ని విధాలా ఆదుకుంటాం` అని అభయ హస్తం అందించినట్టు సమాచారం.
ఈ సినిమాలో కొణిదెల ప్రొడక్షన్ నిర్మాణ భాగస్వామినే అయినా, చివరి నిమిషంలో.. చిరు, చరణ్‌లు పారితోషికాలు తీసుకుని పక్కకు తప్పుకున్నట్టు తెలుస్తోంది. కొరటాల కూడా.. ఈ సినిమాలో భారీగా పెట్టుబడి పెట్టాల్సివచ్చిందని టాక్. అయితే చివర్లో మంచి బిజినెస్ జరగడంతో ఆయన వాటా లాభాలు ఆయనా తీసుకొన్నారు. ఇప్పుడు అలా తీసుకొన్న పారితోషికంలో కొంత భాగం తీసి, నష్టపోయిన బయ్యర్లకు సర్దుబాటు చేసే ప్రయత్నాలు మొదలెట్టారు. ఓ రకంగా... ఆచార్య బయ్యర్లకు ఇది కాస్త ఉపశమనం కలిగించే వార్తే.