ఈ సంక్రాంతి పోటీ మామూలుగా ఉండేట్టు కనిపించడం లేదు. ఇప్పటికే 3 సినిమాలు రిలీజ్ డేట్లు ప్రకటించేశాయి. ఆర్.ఆర్.ఆర్.. జనవరి 7న వస్తుంది. జనవరి 14న రాధే శ్యామ్ విడుదల తేదీ ఫిక్స్ చేసుకుంది. ఈ రెండింటి మధ్యలో భీమ్లా నాయక్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. జనవరి 12న భీమ్లా నాయక్ ని విడుదల చేస్తామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించేసింది. సంక్రాంతి సీజన్ లో ఎన్ని సినిమాలు వచ్చినా, చోటుంటుంది. కాకపోతే.. మూడూ భారీ సినిమాలు కావడంతో, బయ్యర్లకు ఇబ్బంది తప్పేట్టు లేదు.
ముఖ్యంగా కావల్సిన సంఖ్యలో థియేటర్లు దొరకడం కష్టం. ఆర్.ఆర్.ఆర్ లాంటి సినిమాలు సోలో రిలీజ్ ని కోరుకుంటాయి. ఎందుకంటే ఆయా సినిమాల బడ్జెట్లు ఆ స్థాయిలో ఉంటాయి మరి. ఆర్.ఆర్.ఆర్ కూడా అదే ఉద్దేశ్యంతో సంక్రాంతి రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. ఆర్.ఆర్.ఆర్ వస్తే మిగిలిన సినిమాలన్నీ తప్పుకుంటాయని, అప్పుడు వసూళ్లన్నీ లాగేసుకోవచ్చని ప్లాన్ చేసింది. కానీ అనూహ్యంగా భీమ్లా నాయక్ రిలీజ్ కి రెడీ అయ్యాడు. 5 రోజుల వ్యవధిలో భీమ్లా నాయక్ వస్తే... పరిస్థితి కొంచెం తేడా కొడుతుంది. ఎంత ఆర్.ఆర్.ఆర్ సినిమా అయినా, ఎదురుగా ఉన్నది... పవన్ కల్యాణ్. కాబట్టి.. వసూళ్లు చీలిపోయే అవకాశం ఉంది.
భీమ్లా నాయక్ ఏమాత్రం బాగున్నా - అది పరోక్షంగా, ఆర్.ఆర్.ఆర్ పై ప్రభావం చూపిస్తుంది. అది చాలదన్నట్టు... రాధే శ్యామ్ ఎలాగూ జనవరి 14న వస్తుంది. కాబట్టి.. ఆర్.ఆర్.ఆర్ మరింత ఇబ్బందుల్లో పడిపోతుంది. అందుకే భీమ్లా నాయక్ ని వెనక్కి లాగడానికి రాజమౌళి అండ్ కో శత విధాలా ప్రయత్నిస్తున్నట్టు ఇండ్రస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే డివివి దానయ్య భీమ్లా నాయక్ నిర్మాతతో భేటీ వేసినట్టు తెలుస్తోంది. కానీ.. భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్లు మాత్రం తమ సినిమాని వాయిదా వేయడానికి ససేమీరా అంటున్నారు. అందుకే ఇప్పుడు చిరంజీవిని రంగంలోకి దింపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విషయమై పవన్ తో చిరు మాట్లాడే అవకాశం ఉందని, చరణ్ సినిమా కోసం ఈసారికి అడ్డు తప్పుకోమని అడగబోతున్నాడని టాక్. చిరు అడిగితే పవన్ నో చెప్పే అవకాశమే లేదు. పైగా చరణ్ అంటే... పవన్ కి అభిమానం కూడానూ. ఒకవేళ పవన్ చొరవ తీసుకుంటే, భీమ్లా నాయక్ వెనక్కి వెళ్తుంది. లేదంటే... బాబాయ్ అబ్బాయ్ సినిమాల మధ్య పోటీ తప్పదు.