డిజిటల్ మీడియా ఈ రేంజ్‌లో అందుబాటులోకి వచ్చేశాకా, సినిమాల ప్రభావం ఆడియన్స్‌పై తగ్గిపోయిందన్న విలేకరి అడిగిన ప్రశ్నకు చిరంజీవి ఏమన్నారో తెలుసా? సినిమా సినిమానే. డిజిటల్ మీడియా డిజిటల్ మీడియానే. అయితే, స్మార్ట్ ఫోన్ రూపంలో చేతిలోనే అంత కంటెంట్ అందుబాటులో ఉన్నప్పుడు, సినిమాతో అంతకు మించి ఇంకేం ఇవ్వగలమన్న ఆలోచనలోంచే ఇంకా కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి.
అలా వచ్చిన సినిమాలే 'అర్జున్‌రెడ్డి', 'కేరాఫ్ కంచరపాలెం' తదితర సినిమాలు.. అని చిరు నోట ఆ సినిమాల ప్రస్థావన వచ్చింది. కంటెంట్ పరంగా దర్శకులు మరింత కొత్తగా ఆలోచించే స్టామినా డిజిటల్ మీడియానే కల్పించింది. మరింత స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారు మన దర్శక, నిర్మాతలు. అందుకే పైన చెప్పుకున్న తరహా సినిమాలు ప్రజలకు చేరువవుతున్నాయి.. అంటూ 'సైరా' ప్రమోషన్స్‌లో చిరంజీవి చెప్పారు.
రేపు అనగా అక్టోబర్ 2న చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాలున్న ఈ సినిమాకి భారీ స్థాయిలో ప్రమోషన్స్ జరుగుతున్నాయి. రెండేళ్లుగా కఠోరమైన వర్క్ చేసి, పరుచూరి బ్రదర్స్ సిద్ధం చేసిన స్క్రిప్ట్‌లో చిన్నా చితకా మార్పులు చేసి, దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాని తెరకెక్కించారు. 150 రోజులు చిత్రీకరణ చేసి, అంత అద్భుతమైన అవుట్ పుట్ రాబట్టారు. ఇక సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల నుండి ఆదరణ ఎలా ఉండబోతుందో మరి కొద్ది గంటల్లోనే తేలిపోనుంది.