ఏపీలో సినిమా పరిశ్రమని అభివృద్ధి చేయాలన్నది ముఖ్యమంత్రి జగన్ ఆశ. ఏపీలో షూటింగులు జరగాలని, అలా జరగాలంటే స్టూడియోలను అభివృద్ది చేయాలన్న ప్లానింగ్ లో ఉన్నారు జగన్. దానికి తగ్గట్టే కొంతమంది సినీ ప్రముఖులకు స్టూడియోలు నిర్మించుకోవడానికి స్థలాల్ని కేటాయించారని, అందులో చిరంజీవి పేరు కూడా ఉందని వార్తలొచ్చాయి. భీమిలి సమీపంలో చిరుకి స్థలం కేటాయించారని, అక్కడ స్టూడియో నిర్మాణం చేపట్టనున్నారని చెప్పుకొన్నారు.
వీటిపై చిరంజీవి స్పందించారు. ఇటీవల ఆచార్యకు సంబంధించిన ప్రమోషన్లలో భాగంగా ప్రింట్, వెబ్ మీడియాలతో మాట్లాడారు చిరంజీవి. ఏపీలో స్టూడియో కట్టే ఉద్దశ్యం లేదని కొందరికి, ఏపీలో స్టూడియో కట్టే ప్రపోజల్స్ వచ్చినా, ప్రస్తుతం ఆలోచిస్తున్నానని ఇంకొందరికి చిరు చెప్పడం ఆశ్చర్యపరుస్తోంది. అంటే ఏపీలో స్టూడియోలు కట్టాలా, వద్దా? అనే విషయంలో చిరు ఇంకా డైలామాలోనే ఉన్నారన్నమాట. ఏపీలో స్టూడియోలు కట్టే అవకాశం ఇస్తే ఎవ్వరూ వదులుకోరు. జగన్‌తో చిరుకి సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో చిరు ఎక్కడ అడిగితే అక్కడ స్థలం కేటాయిస్తారు. అలాంటప్పుడు చిరు స్టూడియోలకు ఎందుకు నో చెబుతారు..? చిరు మనసులో స్టూడియో కట్టే ఆలోచన ఉందని, అయితే ఆయన ఇప్పుడే బయట పడదలచుకోలేదని సన్నిహితులు చెప్పుకోవడం మరో విశేషం.