సెకండ్ ఇన్నింగ్స్ లో చిరు జోరు మామూలుగా లేదు. ఖైది నెం.150 తరవాత.. చారిత్రాత్మక `సైరా` తెరకెక్కించాడు. ఆ తరవాత ఆచార్య లైన్ లో పెట్టాడు. ఇప్పుడు ఏకంగా మూడు నాలుగు కథలు ఓకే చెప్పేశాడు. లూసీఫర్, వేదాళం రీమేక్‌లు చిరు చేతిలో ఉన్నాయి. బాబి కథ కూడా ఓకే అయ్యింది. మారుతి సినిమా దాదాపుగా పక్కా. ఇప్పుడు ప్రభుదేవాకి సైతం చిరు పిలిచి అవకాశం ఇచ్చాడన్నది టాలీవుడ్ టాక్. ప్రభుదేవాతో చిరుకి మంచి అనుబంధం ఉంది. అప్పట్లో చిరు నటించే ప్రతీ సినిమాకీ ప్రభుదేవానే నృత్య దర్శకుడు.
శంకర్ దాదా జిందాబాద్ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. పైగా ఇప్పుడు ప్రభుదేవా ఫామ్ లో కూడా లేడు. సల్మాన్ తో తీసిన `రాధే` అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయినా సరే, ప్రభుదేవాని పిలిచి అవకాశం ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రభుదేవా రీమేక్ లు తీయడంలో నేర్పరి. ఆ ఉద్దేశంతోనే ప్రభుదేవాని పిలిచి అవకాశం ఇచ్చాడని, ప్రభుదేవాకి ఓ రీమేక్ కట్టబెట్టాడని ప్రచారం మొదలైంది. మరి ఆ రీమేక్ ఏమిటో? ఈ కాంబోలో సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాలి.