నటీనటులు : హస్వంత్ వంగ, నమ్రత దరేకర్, తనికెళ్ల భరణి, రాజారవీంద్ర తదితరులు
దర్శకుడు: వై యుగంధర్
నిర్మాతలు: చింత గోపాల కృష్ణ రెడ్డి
సంగీతం: సాహిత్య సాగర్
ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్
సినిమాటోగ్రఫీ : జెమిన్ జోమ్ అయ్యనేత్
రేటింగ్: 2.5/5
అడల్ట్ కంటెంట్‌కీ, రొమాన్స్‌కీ చాలా తేడా ఉంది. రెండింటి మధ్య చిన్న గీత ఉంది. అదేమిటన్నది ఈ తరం దర్శకులు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పెరిగాక.. రొమాన్స్ డోసు మరింత పెరిగింది. తెర పై ఏదైనా చూపించేయొచ్చు అనుకుంటున్నారు. ఆ విపరీత బుద్ధి.. వెండి తెరకు ఎప్పుడో పాకేసింది. అందుకే ముద్దులు, బెడ్ రూమ్ దృశ్యాలూ.. మన సినిమాల్లో కామన్ అయిపోయాయి. `ఇప్పుడు కాక ఇంకెప్పుడు` ట్రైలర్ చూస్తే మరో బోల్డ్ కంటెంట్ సినిమా బయటకు వచ్చిందన్న భావన కలుగుతుంది. అదే... ఈ సినిమాపై కాస్త ఫోకస్ కలిగేలా చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? పూర్తిగా కొత్త వాళ్లతో రూపొందిన ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ ఎంత? కథెంత?
* కథ
ఈ కథ వైజాగ్ లో మొదలవుతుంది. గౌతమ్ (హశ్వంత్), అను (నమ్రత) ఇద్దరూ కట్టుబాట్ల మధ్య పెరిగిన వాళ్లే. గౌతమ్ కి ఆడవాసన అంటేనే తెలీదు. అను మగవాళ్లకు ఆమడ దూరం. యుక్త వయసు వచ్చాక, చదువు పూర్తయ్యాక.. ఇద్దరూ ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తారు. దాంతో.. వాళ్ల కు రెక్కలొస్తాయి. ఊహించని స్వేచ్ఛ దొరుకుతుంది. ఇద్దరూ పేర్లు మార్చుకుని మరీ ప్రేమలో పడతారు. కుర్రతనం వల్లో, హర్మోనుల ప్రభావం వల్లో.. ఇద్దరూ చేయకూడని తప్పు కూడా చేసేస్తారు. అయితే ఆ మత్తు దిగిన తరవాత... కొత్త సమస్యలు వస్తాయి. అవేమిటి? ఆ తరవాత ఏమైందన్నదే అసలు కథ.
* విశ్లేషణ
ఇదో యూత్ ఫుల్ స్టోరీ. ప్రేమ, వ్యామోహం, అల్లరి, వయసు వేడిలో చేసిన తప్పులు, దాన్ని సరిదిద్దుకోవడానికి పడే పాట్లూ.. ఇవన్నీ ఈ సినిమాలో కనిపిస్తాయి. కేవలం యూత్ ని మాత్రమే ఉద్దేశించి తీసిన సినిమా ఇది. అందుకే... బోల్డ్ సన్నివేశాలు కనిపిస్తాయి. ముదురు మాటలు, డబుల్ మీనింగ్ డైలాగులు, రొమాన్స్ ఇవన్నీ విపరీతంగా దట్టించారు. తొలి సగంలో చైల్డ్ ఉడ్ ఎపిసోడ్, ఆ తరవాత.. హైదరాబాద్ లో ఒకరినొకరు పరిచయం అవ్వడం, సిటీ కల్చర్... ఇవన్నీ ఆసక్తికరంగానే ఉంటాయి. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కుదరడం, కొన్ని సన్నివేశాలు పండడంతో - ఫస్టాఫ్ కొన్ని కుదుపులతో పాసైపోతుంది.
అయితే ఏ ప్రేమకథకైనా ఎమోషన్ చాలా ముఖ్యం. అది ఈ సినిమాలో లోపించింది. సంఘర్షణ కూడా బలహీనంగా ఉంటుంది. హీరో - హీరోయిన్ల మధ్య నడిచే ఆఫీసు సన్నివేశాలు పూర్తిగా సాగదీత ధోరణిలో సాగుతాయి. రొమాన్స్ మితిమీరడంతో... కుటుంబ సమేతంగా ఈ సినిమా చూడడం చాలా చాలా కష్టం. కామెడీ కోసం కొన్ని ట్రాకులు పెట్టారు. అవి కేవలం అతికించినట్టు ఉన్నాయంతే. చివర్లో సంప్రదాయాల గురించి, కట్టుబాట్ల గురించి కొన్ని సంభాషణలు చెప్పించారు. అవి ప్రారంభంలో బాగానే ఉన్నా, రాను రాను క్లాస్ పీకినట్టు అయిపోయాయి.
పిల్లల్ని కట్టుబట్ల మధ్యలో పెంచడం మంచిదే. కానీ.. అది కూడా మితిమీరినట్టు ఉంటే...వాళ్లు మరిన్ని తప్పులు చేస్తారు అనే సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కాకపోతే.. ఈ విషయం చెప్పడానికి ఇంత మసాలా దట్టించాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. ప్రధమార్థంలో ఉన్న స్పీడు.. ద్వితీయార్థంలో లేకపోవడం, సాగదీత.. ఈ సినిమాని బాగా ఇబ్బంది పెట్టాయి.
* నటీనటులు
హీరో హీరోయిన్లు ఇద్దరూ కొత్తవాళ్లే. కాకపోతే మంచి ఈజ్ తో చేశారు. వాళ్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా పండింది. హీరోయిన్ నమ్రత కొన్ని సన్నివేశాల్లో ఇబ్బంది పడింది గానీ, గౌతమ్ మాత్రం ఎలాంటి బెరుకూ లేకుండా నటించేశాడు. ఇక తనికెళ్ల భరణి లాంటి వాళ్ల గురించి చెప్పేదేముంది? వాళ్ల అనుభవాన్నంతా రంగరించేశారు. రాజా రవీంద్ర ఓకే అనిపిస్తాడు. రాఘవ కామెడీ పండలేదు.
* సాంకేతిక వర్గం
సాహిత్య సాగర్ అందించిన పాటలు మరీ గుర్తు పెట్టుకునేంతగా ఏం లేవు. కాకపోతే.. థియేటర్ల వరకూ ఓకే. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యూత్ ఫుల్ గా ఉంది. జెమిన్ ఫొటోగ్రఫీ నీట్ గా ఉంది. చిన్న సినిమానే. కాకపోతే.. మేకింగ్ క్వాలిటీ బాగుంది. ఫస్టాఫ్ ని నెట్టుకొచ్చిన దర్శకుడు సెకండాఫ్ లో తేలిపోయాడు. కొన్ని సంభాషణలు ఈతరం మనోభావాలకు అద్దం పట్టేలా ఉన్నాయి.
*ప్లస్ పాయింట్స్
యూత్ ఫుల్ కంటెంట్
* మైనస్ పాయింట్స్
మసాలా
* ఫైనల్ వర్డిక్ట్: యూత్ ఫుల్ మసాలా