వాల్తేరు వీరయ్యతో చిరు ఫామ్ లోకి వచ్చేశాడు. చిరంజీవి నుంచి పక్కా కమర్షియల్ సినిమాలు చూడడానికి అభిమానులు సిద్దంగా ఉన్నారన్న సంకేతాలు వాల్తేరు వీరయ్యతో అందేశాయి. ఇప్పుడు అందరి దృష్టీ భోళా శంకర్ పై పడింది. తమిళ వేదాళంకి ఇది రీమేక్. మెహర్ రమేష్ దర్శకుడు. ఎందుకనో... భోళా పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ.. వాల్తేరు వీరయ్య హిట్ తో.. భోళాకి కొత్త కళ వచ్చింది. ఈ సినిమాపై మెల్లగా అంచనాలు పెరుగుతున్నాయి. చిరు కూడా భోళా శంకర్ తో తన ఫామ్ ని కంటిన్యే చేయాలని భావిస్తున్నాడు. అందుకే.. ఈ సినిమాపై ఫోకస్ పెట్టాడు. మాస్, కమర్షియల్ అంశాలు మరిన్ని ఈ సినిమాలో ఉండేలా చిరు జాగ్రత్తలు తీసుకొంటున్నాడు. ముఖ్యంగా పాటలపై శ్రద్ధ పెట్టాడని టాక్.
వాల్తేరుకి దేవిశ్రీ అందించిన పాటలు ప్లస్ పాయింట్ అయ్యాయి. అందుకే.... భోళాలోనూ మాస్ పాటలు అందివ్వాలని చిరు అండ్ కో డిసైడ్ అయ్యారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఓ స్టార్ హీరో సినిమాకి ట్యూన్ ఇవ్వడం మహతికి ఇదే తొలిసారి. చిరంజీవి ఇమేజ్‌కి తగిన ట్యూన్లు మహతి ఇవ్వగలడా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే మహతి కొన్ని ట్యూన్లు సిద్ధం చేశాడు. అయితే వాటిని పక్కన పెట్టి, కొత్త ట్యూన్లు రాబట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఇది కచ్చితంగా యువ సంగీత దర్శకుడిపై ఒత్తిడి పెంచే విషయమే. మహతి ప్లస్ పాయింట్ మెలోడీ ట్యూన్లు. మాస్, కమర్షియల్ పాటలు ఇప్పటి వరకూ కొట్టిన దాఖలాలు లేవు. మరి ఈ కుర్రోడు ఏం చేస్తాడో?