రెండు పడవల మీద ప్రయాణం కష్టమని భావించిన చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లాక సినిమాల్ని వదులుకున్నారు. రాజకీయాలకు దూరమయ్యాక మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. అయితే తన తమ్ముడు మాత్రం సినిమాలకు దూరమవ్వాల్సిన పని లేదనీ, రాజకీయాల్లో, సినిమాల్లో ఏకకాలంలో కొనసాగగలడని, ఆ సమర్ధత తన తమ్ముడిలో ఉందని చిరంజీవి చెప్పారు.
అందుకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ కూడా 'జనసేన' పార్టీ నడుపుతూనే సినిమాలు చేయడం చూశాం. కానీ ఎన్నికల ముందర పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించాల్సి వస్తోంది పవన్ కళ్యాణ్. ఈ పరిస్థితుల్లో సినిమా ఆఫర్లు వస్తున్నా ఏం చేయలేని పరిస్థితి. ఓ సినిమా చేద్దాం అనే ఆలోచన రాగానే ఆ దిశగా అడుగులు వేయాలనుకున్నాడట పవన్ కళ్యాణ్.
అన్నయ్య చిరంజీవి సలహా కోరితే, ఎన్నికలయ్యే వరకూ ఆగడమే మంచిదని సలహా ఇచ్చారట. ఆ కారణంగానే పవన్ కళ్యాణ్ సినిమా చేయాలన్న ఆలోచన పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇది వాయిదా పడ్డ అంశం మాత్రమే. త్వరలో అంటే, మే తర్వాత పవన్ కళ్యాణ్ నటనకు మళ్లీ శ్రీకారం చుట్టవచ్చునట. అన్నయ్యతో కొన్ని అంశాల్లో విబేధించినా అన్నయ్యను తండ్రిగా భావించే పవన్ కళ్యాణ్ ముఖ్యమైన విషయాల్లో మెగాస్టార్ సలహాల్ని పాఠిస్తూనే ఉన్నారు. అంటే మెగాస్టార్ డైరెక్షన్‌లోనే పవన్ కళ్యాణ్ సినీ రాజకీయ ప్రస్థానం కొనసాగుతోందనీ అనుకోవచ్చు.