రాజకీయాల్లోకి వచ్చాక పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య మళ్లీ పవన్ కళ్యాణ్ ముఖానికి రంగు వేసుకోబోతున్నాడనీ, పవన్ కళ్యాణ్‌తో 'గోపాల గోపాలా' చిత్రాన్ని తెరకెక్కించిన డాలీ దర్శకత్వంలో కానీ, 'సర్దార్ గబ్బర్ సింగ్' డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో కానీ పవన్ కళ్యాణ్ సినిమా ఉండొచ్చునంటూ ప్రచారం జరిగింది.
అయితే తాజాగా ఈ విషయమై పవన్ క్లారిటీ ఇచ్చేశారు. సినిమాలకు టైం కేటాయించలేననీ, ప్రస్తుతం తన దృష్టి అంతా రాజకీయాలపైనేనని జనసేన పార్టీ తరపున ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీంతో త్వరలో పవన్ కళ్యాణ్ సినిమా ఉండబోతోందన్న అభిమానుల్లో కాస్త నిరాశ ఏర్పడినా, రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ డెడికేషన్‌కి జై కొడుతున్నారు.
ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్ కోసం డాలీ, బాబీ మాత్రమే కాదు, పలువురు ప్రముఖ డైరెక్టర్లు స్క్రిప్టులు సిద్ధంగా ఉంచారు. పవన్ కళ్యాణ్‌తో 'గబ్బర్‌సింగ్' తెరకెక్కించి రికార్డులు కొల్లగొట్టిన డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ ఊ అంటే ఈ క్షణం సినిమాని సెట్స్ మీదికి తీసుకెళ్లేందుకు సిద్దంగా ఉన్నాడు. అలాగే సెన్సేషనల్ వసూళ్లు కొల్లగొట్టిన 'అత్తారింటికి దారేది' సినిమాని పవన్‌తో డైరెక్ట్ చేసిన త్రివిక్రమ్, మరో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ఇలా పలువురు అదిరిపోయే స్క్రిప్టులతో రెడీగా ఉన్నారు.
కానీ పవన్ కళ్యాణ్ తాజా స్టేట్‌మెంట్‌తో ఈ స్క్రిప్టులన్నీ తాత్కాలికంగా పక్కకి వెళ్లిపోయినట్లయ్యాయి.